నస్రుల్లాబాద్, జూన్ 19: నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో ఉన్న కొచ్చెరు మైసమ్మ ఆలయం వద్ద రూ.కోటీ60లక్షలతో నిర్మిస్తున్న కాటేజీ పనులను మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొచ్చెరు మైసమ్మ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, వారి సౌకర్యార్థం కాటేజీలను నిర్మిస్తున్నామన్నారు. పనులను త్వరితగతిన పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ పాల్త్య విఠల్, బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, సాయిలు, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మాజీద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.