వేల్పూర్, జూన్ 13: మహిళా సాధికారతకు కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళలను కేంద్రంగా చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను వారికి వర్తింపజేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బాల్కొండ నియోజకవర్గస్థాయిలో మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. వేల్పూర్ మండలం లక్కోరలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి మంత్రి వేముల, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తదితరులు హాజరయ్యారు.మహిళల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటి ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలపై లబ్ధిదారులు, స్థానిక సంస్థల మహిళా ప్రజాప్రతినిధులు వివరిస్తూ ప్రభుత్వానికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల శ్రేయస్సును కాంక్షిస్తూ అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనుక్షణం మహిళల బాగోగులపై ఆలోచన చేసే వ్యక్తి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు అందిస్తున్నారని తెలిపారు. మానవీయ కోణంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. ఓట్లు, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. దేశంలోని మరే ఇతర రాష్ర్టాల్లో ఇలాంటి కార్యక్రమాలు అమలుచేయడంలేదన్నారు. మాతా శిశు మరణాల రేటు తగ్గుదలలో తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
మహిళలకు పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, సఖీ కేంద్రాలను ఏర్పాటుచేసిన బాధితులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాలకు విరివిగా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు బాల్కొండ నియోజకవర్గంలో మహిళా సంఘాల సభ్యులు 28వేల మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 60వేలకు పెరిగిందని తెలిపారు. వీరికి బ్యాంకు లింకేజీ కింద 2014కు ముందు వరకు కేవలం రూ.366 కోట్ల రుణాలు ఇవ్వగా, స్వరాష్ట్రంలో రూ.1213 కోట్ల రుణాలు అందించామన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధిస్తున్నారని అన్నారు. వేల్పూర్ మండలంలో నియోజకవర్గ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రూ. 43 లక్షలతో పసుపు ఉత్పత్తుల ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయిస్తానని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. దీని నిర్వహణతో వచ్చే లాభాలను మహిళా సమాఖ్యకు అందజేస్తామన్నారు.
కరోనా సంక్షోభంలో ఆశ, అంగన్వాడీల సేవలు మరువలేనివి
కరోనా సంక్షోభ సమయంలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు ప్రజలకు అందించిన సేవలు మరువలేనివని మంత్రి వేముల కొనియాడారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వారికి తెలంగాణ ప్రభుత్వం వేతనాలు అందిస్తోందన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని సరైన నిర్ణయం తీసుకుని మరింత సంక్షేమాభివృద్ధికి బాటలు వేసుకోవాలని మంత్రి వేముల సూచించారు. కొందరు కొత్తగా దేవుడి క్యాలెండర్లతో రాజకీయం చేయడానికి వస్తున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. మహిళలకు మంత్రి చీరలను పంపిణీ చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డి, డీసీవో సింహాచలం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్, కోటపాటి నర్సింహనాయుడు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.