Indiramma sarees | కంటేశ్వర్, నవంబర్ 22 : మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారు పీ సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిజామాబాద్ కలెక్టరేట్ లో అట్టహాసంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు.
ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా, తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా, ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. కుటుంబ అభ్యున్నతిలో మహిళలే కీలకమని, భవిష్యత్ తరాల బాగు కోసం పిల్లలను చక్కగా చదివించాలని హితువు పలికారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వైపు పిల్లలు పెడదారి పట్టకుండా కాపాడుకోవాలని, నిపుణులైన ఉపాధ్యాయులు, మెరుగుపడిన సదుపాయాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించాలని సూచించారు.
కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు అందించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో చీరల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత మహిళలకు తొలి విడతలో చీరలను పంపిణీ చేస్తున్నారని, పట్టణ ప్రాంతాలలో మార్చి 1 నుండి వారం రోజుల పాటు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర వాటిని ప్రభుత్వం మహిళల పేరుతోనే మంజూరు చేస్తోందని, మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని అన్నారు. అర్హులైన వారందరికీ చీరలు పంపిణీ జరిగేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీ.ఆర్.డీ.ఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, మహిళా సమాఖ్య ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.