బాన్సువాడ రూరల్, మే 12 : ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. వేసవికాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. బాన్సువాడ మండలంలోని కొత్తాబాది గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలు సోమవారం ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలు, బకెట్లతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తాగునీటి సమస్యపై అధికారులు దృష్టిసారించి పరిష్కరించాలని కోరారు.
ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటానా స్థలానికి చేరుకొని మహిళలను శాంతింపజేశారు. తాగునీటి సమస్యపై పంచాయతీ కార్యదర్శి గణేశ్‌ను వివరణ కోరగా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పైప్‌లైన్ తెగిపోవడంతో గ్రామంలో తాగునీరు సక్రమంగా సరఫరా కావడంలేదని తెలిపారు. బోర్లు సైతం ధ్వంసంకావడంతో గ్రామంలో తాగు నీటి సమస్య నెలకొన్నదని చెప్పారు. పైప్‌లైన్ మరమ్మతులు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు.