నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 24: నిజామాబాద్ కమిషరేట్ పరిధిలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్‌కు ఎనిమిదేండ్ల తరువాత సీఐగా మహిళ వచ్చారు. సీఐగా ఎం. వెంకటమ్మను గత నెలలో అధికారులు నియమించగా, బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహిళా పోలీసు స్టేషన్‌కు ఓ మహిళా అధికారిని నియమిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని మెదక్ జిల్లాకు చెందిన వెంకటమ్మ 1991 బ్యాచ్‌లో మహిళా కానిస్టేబుల్‌గా సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహించారు. 2005 లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2011 లో ఏఎస్సైగా ఉద్యోగోన్నతి పొందిన ఆమె సంగారెడ్డి జిల్లాలో పని చేశారు. 2013 లో ఎస్సైగా ప్రమోషన్ పొందిన వెంకటమ్మ మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించారు. 2021 మార్చి లో సీఐగా ఉద్యోగోన్నతి పొందిన ఆమె హైదరాబాద్ సీసీఎస్ విభాగంలో పని చేశారు. అక్కడి నుంచి 2022 జనవరి నెలలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 317 జీవో ప్రకారం నిజామాబాద్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌కు సీఐగా వచ్చారు.
నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో 2011 జనవరిలో మహిళా సీఐగా ఇందిరా దేవిని నియమించారు. ఆమె 2013 నవంబర్ వరకు సీఐగా కొనసాగారు.అనంతరం అప్పటి నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 8 మంది సీఐలుగా పురుషులే స్టేషన్లో విధులు నిర్వహించారు. కొంత మంది బాధిత మహిళలు తమ వ్యక్తి గత సమస్యలను చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. మరి కొంత మంది ఫిర్యాదు చేసేందుకు మహిళా పోలీస్ స్టేషన్ వరకు వచ్చినప్పటికీ ఇక్కడ తమ అంతర్గత సమస్యలను మగ ఆఫీసర్ ముందు చెప్పుకోలేక వెనుదిరిగిన కేసులు సైతం ఉన్నట్లు ఆ స్టేషన్లో విధులు నిర్వర్తించిన సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం మహిళా ఆఫీసర్ స్టేషన్‌కు రావడంతో మహిళలు తమ సమస్యలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అధికారిణికి వివరించుకొనే అవకాశం ఉంటుందని స్టేషన్లో పని చేసే మహిళా సిబ్బంది అంటున్నారు.