వినాయక్‌నగర్, ఫిబ్రవరి 6 : మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. కానీ వారు పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు పెరిగిపోవడం అతివల ప్రగతికి ప్రతిబంధకంగా మారుతున్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. వేధింపులు, దాడులు మహిళల్లో అభద్రత పెంచి పోటీ ప్రపంచంలో వారి ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన ‘మహిళలు పనిచేసే చోట జరుగుతున్న లైంగిక వేధింపులపై అవగాహన సదస్సు’లో జిల్లా జడ్జి మాట్లాడారు.
స్త్రీలపై లైంగికదాడికి పాల్పడినా, శారీరకంగా సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసినా, మహిళల పట్ల అశ్లీల పదజాలం వాడినా, శారీరకంగా, మానసికంగా వేధించినా అవి లైంగిక వేధింపు కిందకు వస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళలు పది మంది, అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడ ఇంటర్నల్ కంప్లెయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుష్బు ఉపాధ్యాయ, ఇన్చార్జి సీపీ సింధూశర్మ, జిల్లా సంక్షేమాధికారి రసూల్‌బీ, కంప్లెయింట్ అథారిటీ చైర్పర్సన్ నీరజారెడ్డి, అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, డీసీపీ రామచంద్రారావు, ఏసీపీలు రాజావెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, మహిళా ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.