murder | కామారెడ్డి : అప్పు ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని అడినందుకు ఓ మహిళను హత్య చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామణిపల్లి గ్రామానికి చెందిన జంగంపల్లి మహేష్‌పై గతంలో బిక్కనూరు పోలీసు స్టేషన్లో మర్డర్ కేసు నమోదైంది.
కాగా ఆ కేసుకు సంబంధించి బెయిల్ కోసం కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లికి చెందిన చిదుర కవిత వద్ద రూ.ఒక లక్ష అప్పుగా తీసుకున్నాడు. అయితే ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని కవిత మహేష్‌ను అడగగా డబ్బులను ఇస్తానని, వ్యవసాయ బావి వద్దకు రావాలని సూచిస్తాడు. అక్కడకు రాగానే ఆమెను పథకం ప్రకారం.. కవితపై దాడి చేసి ఆమె చీర కొంగుతో ఉరి వేసి హత్య చేశాడు. వెంటనే ఆమె పై ఉన్న బంగారు కమ్మలు, మాటిలు, ఉంగరం, ఆమె మొబైల్ ఫోన్ దొంగిలించి ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుండి పారిపోయాడు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా మహేష్‌పై అనుమానం రాగా విచారణ చేపట్టడం జరిగింది.
కాగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందుతుడి వద్ద నుండి కమ్మలు, మాటిలు, ఉంగరం, మొబైల్ ఫోన్ స్వాదీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఈ కేసును 48 గంటలలోపు చేధించిన కామారెడ్డి రూరల్ సీఐ ఎస్ రామన్, దేవునిపల్లి ఎస్సై జీ రాజు, క్రైమ్ టీం సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.