వినాయక్‌నగర్, మార్చి 28: వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యం కావడంతో కంగుతిన్నారు. నిజామాబాద్ రూరల్ ఠాణా పరిధిలోని బైపాస్ రోడ్లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పోలీసులు రోజులానే బైపాస్ రోడ్లో వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో ఓ కారును ఆపి సోదా చేస్తుండగా, డిక్కీలో మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. హతురాలు ఎవరనేది ఆరా తీయగా, ముబారక్‌నగర్ ప్రాంతానికి చెందిన కమల (50)గా తేలింది. హత్య కేసు నమోదు చేసిన రూరల్ ఠాణా పోలీసులు.. మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. కమలను ఎవరు, ఎందుకు హత్య చేశారనే దానిపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
మహిళను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐ సురేశ్ విచారిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మహిళను ఎందుకు చంపింది నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ముబారక్‌నగర్‌కు చెందిన కమల కొందరు మహిళలతో వ్యభిచారం చేయిస్తుండేదని తెలిసింది.
ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళను కూడా ఈ రొంపిలోకి దింపినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన సదరు మహిళ కుమారుడు.. తన తల్లితో తప్పుడు పని చేయిస్తున్న కమలపై కక్ష కట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కమలను కారులో ఎక్కించుకుని డిచ్పల్లి ఠాణా పరిధిలోకి తీసుకెళ్లి కల్లు తాగించిన అనంతరం హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మృతదేహం దొరకకుండా చేసే ప్రయత్నంలో భాగంగా కారులో తరలిస్తూ పోలీసులకు చిక్కినట్లు తెలిసింది.