ఆర్మూర్‌టౌన్, మే 9: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అమ్ముకునేందుకు కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా ఇక్కట్లు తప్పడం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో ధాన్యాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.
కొనుగోళ్లలో జాప్యం కారణంగా వడ్లు ఎక్కడికక్కడే ఉండిపోయాయని, అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తాలు తీస్తే తోలు తీస్తామని గతంలో బీరాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
మరీ ఇప్పుడు ఎవరి తోలు తీయాలని నిలదీశారు. ఆరు గ్యారంటీలు అటకెక్కించి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రతి గింజా కొనుగోలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే బీఆర్ఎస్ తరఫున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.