దోమకొండ. జూన్ 14: వానాకాలం ప్రారంభమైంది. పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే దుక్కి దున్ని విత్తనాలు వేసుకునే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. అయితే, సీజన్ ఆరంభంలోనే అందాల్సిన రైతుబంధు సాయం ఇంకా అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ హయాంలో జూన్‌లోనే రైతులకు రైతుబంధు డబ్బులు వచ్చేవి. దీంతో కర్షకులకు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఎలాంటి ఢోకా ఉండేది కాదు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. యాసంగికి సంబంధించిన రైతుబంధు డబ్బులను మొన్నటిదాకా ఖాతాల్లో జమ చేసిన రేవంత్ సర్కారు.. వానాకాలనికి సంబంధించిన ఇంకా ప్రక్రియనే మొదలు పెట్టలేదు. దీంతో డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు అయోమయం చెందుతున్నారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వైపు దృష్టి సారిస్తున్నారు.
తాము అధికారంలోకి వస్తే రైతుబంధు కింద ఇస్తున్న మొత్తాన్ని మరింత పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందర వాగ్దానం చేసింది. రైతుభరోసా పేరిట ఎకరాకు ఇప్పుడిస్తున్న రూ.10 వేలకు అదనంగా రూ.5 వేలు కలిపి ఏటా రూ.15 వేలు అందిస్తామని ప్రకటించింది. కౌలు రైతులకూ రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, గత డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు తాము చెప్పినట్లుగా రైతుభరోసా అమలు చేయలేదు. కేసీఆర్ ఇచ్చినట్లే యాసంగి పెట్టుబడి సాయాన్ని రూ.5 వేలకు పరిమితం చేసింది. వానాకాలం నుంచి రైతుభరోసా అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పటివరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అసలు పెట్టుబడి సాయం చేస్తారా..? చేస్తే రూ.10 వేలు ఇస్తారా.. లేక ఇచ్చిన మాట ప్రకారం రూ.15 వేలకు పెంచుతారా? అన్న దానిపై స్పష్టత కరువైంది.
పంటల సాగు ఆరంభానికి ముందే రైతులకు పెట్టుబడి అందించాలన్నది రైతుబంధు ముఖ్య ఉద్దేశం. కానీ, కాంగ్రెస్ సర్కారు ఆ లక్ష్యాన్ని నీరుగార్చేసింది. గత యాసంగిలో ఇవ్వాల్సిన పెట్టుబడి సొమ్మును మొన్నమొన్నటి వరకు అంటే లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, వానాకాలం సాయానికి సంబంధించి ఇప్పటికీ ఉలుకుపలుకు లేదు. సీజన్ ప్రారంభం కావడం, తొలకరి జల్లులు కురుస్తుండడంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. అయితే, రైతుబంధు డబ్బులు పడకపోవడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు డబ్బుల్లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్ణీత సమయంలోగా డబ్బులు రాకపోతే అదును దాటిపోతుందన్న భయంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు రైతులేమో రైతుబంధు సాయం రాగానే వడ్డీతో తిరిగి చెల్లిస్తామని చెప్పి డీలర్ల వద్ద ఉద్దెర పెట్టి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. పదేండ్ల క్రితం నాటి దృశ్యాలు పునరావృతమమయ్యాయి. విత్తనాలు, ఎరువుల కోసం రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. పాస్‌బుక్కులు, చెప్పులను వరుసలో పెట్టి పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు దాపురించాయి. గతంలో 24 గంటల పాటు కరెంట్ సరఫరా కాగా, ఇప్పుడు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. మొన్నటిదాకా నిండుగా కనిపించిన జలాశయాలు ఇప్పుడు ఎండిపోయి మైదానాలను తలపిస్తున్నాయి. గతంలో ఎండాకాలంలోనూ గలగల పారిన కాలువలు నేడు బోసిపోయాయి.
ఉమ్మడి రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయానీయంగా ఉండేది. నీళ్లు, కరెంట్ సరిగా లేక, సర్కారు మద్దతు లేక అన్నదాతల బతుకులు ఆగమయ్యాయి. అప్పులు తెచ్చి సాగు చేసినా పంటలు పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధర రాక వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ పరిస్థితి కొనసాగొద్దని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందులు పడొద్దనే లక్ష్యంతో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు. 2018-19 వానకాలం నుంచి ప్రారంభమైన ఈ పథకం కింద మొదట్లో ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించారు. ఆ తర్వాత ఆర్థిక సాయాన్ని రూ.5 వేలకు పెంచిన కేసీఆర్.. పంటల సాగు ఆరంభంలోనే రైతుల ఖాతాల్లో డబ్బును జమ చేశారు. అలాగే, నిరంతర కరెంట్, సాగునీటిని అందించడం, సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తేవడమే కాకుండా మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో వ్యవసాయం పండుగలా మారింది.
ఎన్నికల ముందర గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు రైతుబంధు పథకంపై ఆంక్షలు విధించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పుడున్న లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు గాను అనేక కొర్రీలు పెట్టాలని యోచిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతుల నుంచి మొదలుకుని ఎంత భూమి ఉన్నా వారందరికీ పెట్టుబడి సాయం అందజేసింది. ఏటా రూ.12 వేల కోట్ల నుంచి రూ.16 వేల కోట్ల భారం పడుతున్నా రైతుల శ్రేయస్సు కోసం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. కానీ ప్రస్తుత రేవంత్ సర్కారు అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని యోచిస్తున్నది