వేల్పూర్/ మోర్తాడ్, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం వేల్పూర్ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక్‌కట్ చేశారు. సాయంత్రం మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో సీసీ, బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులతో కేక్‌కట్ చేయించిన అనంతరం మాట్లాడారు. కేసీఆర్ కారణజన్ముడని, తెలంగాణ కోసమే పుట్టిన మహనీయుడని అన్నారు. తె లంగాణ కోసం 2001లో ఒక్కడే ఉద్యమం ప్రారంభించారన్నారు. ఉద్యమం ప్రారంభించినప్పుడు కౌరవ సైన్యంలా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నా కేసీఆర్ భయపడలేదన్నారు. ఆయన వెంట బయల్దేరిన అతికొద్ది మందిలో తన తండ్రి సురేందర్ రెడ్డి ఒకరన్నారు. నిరాహార దీక్ష చేపట్టి, చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించారని అన్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ కోసం కొట్లాడిన వారినే ప్రజలు ఆశీర్వదించారని తెలిపారు.
‘తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.200 పింఛన్ రూ.2వేలకు పెరగలేదా…రైతుబంధుతో ఎకరానికి ఏడాదికి రూ.10వేలు ఇస్తలేదా, కల్యాణలక్ష్మి ద్వారా ఆడపిల్ల కుటుంబానికి రూ.లక్ష ఇవ్వడం లేదా, 24గంటల కరెంటు ఇవ్వడం లేదా, రైతుబీమా ఇవ్వడం లేదా ఇందులో ఏదైనా అబద్ధం ఉందా ఉంటే నిరూపించండి.. దోన్పాల్ గ్రామంలో ముక్కు నేలకు రాస్తానని..’ బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మంత్రి వేముల సవాల్ విసిరారు. అబద్ధాలు ప్రచారం చేయడంతో తాత్కాలికంగా ప్రజలను నమ్మిస్తారేమో కానీ నిజాన్ని దాచిపెట్టలేరని, అది తెలుసుకున్న ప్రజలు ఊరుకోరన్న విషయాన్ని గుర్తించాలన్నారు. వేల్పూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీటీసీ అల్లకొండ భారతి, వైస్ ఎంపీపీ బోదపల్లి సురేశ్, భీమ్‌గల్ ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ రవి,ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు పాల్గొన్నారు. దోన్పాల్ కార్యక్రమంలో ఎంపీపీ శివలింగుశ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్ పాల్గొన్నారు.