రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న గ్యారెంటీ పథకాలను అర్హులమైన తమకు అందించాలని కోరుతూ ప్రజలు ప్రజాపాలన కేంద్రానికి తరలివస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హంగు ఆర్భాటాలతో ఊరూరా ప్రారంభించిన కేంద్రాల్లో గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు లబ్ధి చేకూరలేదని ప్రజలు మండిపడుతున్నారు. మొదట వివరాలు తప్పుగా నమోదు చేశామని, తర్వాత ఎన్నికల కోడ్ అంటూ మళ్లీమళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇంకా దరఖాస్తులు స్వీకరిస్తూ అధికారులు కాలం గడిపితే అర్హులైమైన తమకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలు అందేదెప్పుడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తుదారులతో సందడి నెలకొన్నది.