సారంగాపూర్, డిసెంబర్ 22 : కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడంతోపాటు పెద్ద మొత్తంలో సొంత భవనాలను నిర్మించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలానికి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని మూడున్నరేండ్ల క్రితం మంజూరు చేసింది. మూడేండ్ల పాటు మోపాల్ మండల కేంద్రంలోని అద్దె భవనంలో తరగతులు కొనసాగేవి. భవనానికి నెలకు రూ.22 వేలు అద్దె చెల్లించేవారు. అద్దె భవనం ఇరుకుగా ఉండడం, సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యాలయ భవన నిర్మాణానికి అప్పటి రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవ చూపి రూ.3.72 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఆకులకొండూర్ జీపీ పరిధిలోని అశోక్ఫారం గ్రామ ప్రధానరోడ్డు పక్కన 2 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమిని తాజామాజీ సర్పంచ్ మెట్టు అశోక్ సహకారంతో అధికారులు కేటాయించగా నూతన భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో తరగతి గదులు, ప్రిన్సిపాల్ కార్యాలయం, వంట శాల, భోజనశాల నిర్మించారు. మొదటి, రెండో అంతస్తులలో విద్యార్థినుల కోసం ఉండేందుకు డార్మెటరీ గదులను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మోపాల్‌లోని అద్దె భవనం నుంచి ఈ కొత్త భవనంలోకి విద్యార్థినులను షిప్ట్ చేశారు. ఈ భవనంలో రూరల్ మండల కేజీబీవీకి చెందిన 6-10 తరగతి వరకు సుమారు 300 మంది విద్యార్థులు, నార్త్ మండల కేజీబీవీకి 6, 7 తరగతులకు చెందిన 42 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. కేజీబీవీ ప్రాంగణంలో విశాలమైన స్థలం ఉన్నదని, క్రీడలు ఆడేందుకు మొరంతో చదును చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు. ప్రహరీ నిర్మాణం కోసం అధికారులకు విన్నవించామని, కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు శ్రీవేణి, అశ్విని తెలిపారు. కానీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు.
ఈ విద్యాలయ భవనానికి ప్రహరీ లేకపోవడం, చుట్టూ పొలాలు ఉడడంతో తరగతి గదుల్లోకి, గ్రౌండ్లోకి పాములు, విషపురుగులు వస్తున్నాయి. దీంతో విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.