ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి రూరల్, మే 18: ఎల్లారెడ్డిలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అనేక కష్టాలను తెచ్చిపెట్టింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా, సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాదాపు గంటకు పైగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
బలమైన గాలుల కారణంగా చెట్లు విరిగి పడ్డాయి. కేకేవై జాతీయ రహదారిపై మర్రిచెట్టు అడ్డంగా పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు, ఒక్కసారిగా వర్షం రావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కల్లాల్లో ఉన్న ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. పలుచోట్ల ధాన్యం రాశులు తడిసిపోవడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరయ్యారు.