నాగిరెడ్డిపేట/ బాన్సువాడ రూరల్/ రుద్రూర్/లింగంపేట/ నిజాంసాగర్, నవంబర్ 1: కొన్నిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు విలవిలలాడుతున్నారు. రోడ్లు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం, కొయ్యగుట్ట, జక్కల్‌దాని తండా, బోర్లం క్యాంపుతోపాటు నాగిరెడ్డిపేట, రుద్రూర్, లింగంపేట మండలంలోని భవానీపేట, జల్దిపల్లి, ముంబాజీపేట, రాంపూర్, శెట్పల్లి, పర్మళ్ల, మెంగారం, బోనాల్, బాయంపల్లి, మహ్మద్‌నగర్ మండలం కోమలంచ గ్రామంలో శుక్రవారం వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.
ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం ఎక్కడికక్కడే ఉంది. దీనికి తోడు కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాల్లో వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని చూస్తూ రైతులు కంట తడిపెడుతున్నారు. బాన్సువాడ మండలంలో ఇప్పటి వరకు రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చేతికొచ్చిన పంట నోటికందకుండా పోతోందని వాపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటనే సేకరించాలని రైతులు కోరుతున్నారు.
రామారెడ్డి, నవంబర్1: మండల కేంద్రంలో శుక్రవారం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల నుంచి కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో తడిసిన ధాన్యానికి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మాజీ జడ్పీటీసీ నారెడ్డి దశరథ్‌రెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పడిగెల శ్రీనివాస్ గుప్తా, బీఆర్ఎస్నాయకులు కొనుగోలు కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
పొతంగల్, నవంబర్ 1: నాలుగెకరాల్లో వరి సాగు చేసిన. వడ్లు పూర్తిగా ఎండిపోయి మ్యాచర్కు వచ్చినయ్. కొనుగోలు చేస్తలేరు. దీపావళి పండుగ చేసుకుందామంటే వాతావరణం చూస్తే ఆగమాగం అయితుంది. వడ్లకాన్నే ఉండుడవుతున్నది. వడ్లను ఎండిబెట్టి కుప్ప చేసినం. ఎప్పుడు కొంటారని ఏ అధికారికి అడిగిన కూడా ఫలితం లేదు. స్పందించి వెంటనే వడ్లు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న.
– సూదం అశోక్, రైతు (పొతంగల్)