టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డికి గురువారం అపూర్వ స్వాగతం లభించింది. ఇందల్వాయి నుంచి నిజామాబాద్ వరకు వేలాది వాహనాల శ్రేణితో భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా గజమాలలతో సత్కరించారు. అనంతరం కలెక్టరేట్ మైదానంలో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకలు, జీవన్‌రెడ్డి సత్కార కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు షకీల్, బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, వందలాదిమంది స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / ఖలీల్‌వాడి: టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి రాక సందర్భంగా గురువారం చేపట్టిన స్వాగత కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు ఇందల్వాయి నుంచి నగరం వరకు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు షకీల్, బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ విఠల్ రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డితోపాటు వందలాది మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్ మైదానంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా జీవన్ రెడ్డికి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు అందించారు. బాజిరెడ్డి, జీవన్ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి మంత్రి వేముల కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. నూతన అధ్యక్షుడి హోదాలో జీవన్‌రెడ్డి తొలిసారి జిల్లాకు రావడంతో పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం సభలో మాట్లాడారు. బీజేపీతీరును దుయ్యబట్టారు. ఎంపీ అర్వింద్‌కు మంత్రి వేముల, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమంటూ స్పష్టం చేశారు.
జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ అంటూ అభివర్ణించారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన దొంగ ఎంపీ అని మండిపడ్డారు. కేసీఆర్, ప్రభుత్వంపై నోరు పారేసుకునే వాళ్లను వదలొద్దని బాజిరెడ్డి గోవర్ధన్ సూచించగా… తప్పక సూచన పాటిస్తామంటూ జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఓపిక నశించి తలచుకుంటే ఇటున్నోడు అటు, అటున్నోడు ఇటు పోడని అన్నారు. తెలంగాణ గాంధీ… కేసీఆర్ అని పేర్కొన్నారు.
రాష్ర్టాన్ని తెచ్చిన నేతకు బర్త్ డే సెలబ్రేషన్ చేస్తుంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గాంధీభవన్ గాడ్సేగా రేవంత్‌ను అభివర్ణించాడు. దుష్ట చతుష్టులు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఈ రాష్ర్టానికి, దేశానికి పట్టిన శని అని మండిపడ్డారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నించిన మోదీ… సాడే సాత్ ప్రధాని అని అన్నారు. కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. నిజామాబాద్ గడ్డ ముమ్మాటికి టీఆర్ఎస్ అడ్డా అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెబితే, నిందలు మోపితే, కేసీఆర్, ఆయన కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తరిమి తరిమి కొడతామంటూ హెచ్చరించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, రేవంత్ రెడ్డి మాటలు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఆట మొదలైందంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు జీవన్ రెడ్డి ఘాటుగా జవాబిచ్చారు. వేటాడుతాం. వెంటాడుతాం. పరిగెత్తిస్తామన్నారు. కేసీఆర్‌కు 63లక్షల సైన్యం ఉందన్నారు. ఆయనను ఏమన్నా అంటే టీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసి ఊదితే కొట్టుకు పోతారని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలకు మంచి జరుగుతుంటే కొద్ది మందికి జీర్ణం కావడం లేదని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజల కోసం కష్టపడి పని చేస్తున్న ప్రభుత్వంపై బీజేపీ నేతలు మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు ప్రజలకు ఏమీ చేయకుండా నిత్యం అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. వైకుంఠధామాలు, హౌసింగ్‌లో కేంద్రం వాటా ఉందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వివరించారు. వీరి అబద్ధపు ప్రచారాలు జనాలకు అర్థమైందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, మంత్రులను బీజేపీ నేతలు కొంత మంది విమర్శిస్తున్నారని, వారిని అలాగే వదిలేయొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ నాయకుడొకడు తమ ఏరియాకు వస్తే బుద్ధి చెప్పామని, ఆర్మూర్లోనూ గుణపాఠం తగిలిందన్నారు. అడ్డమైన మాటలు మాట్లాడితే భరించేది లేదన్నారు. చెప్పులతో పూజ చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రజల కోసం కష్టపడుతుంటే బీజేపీ నేతలు అబద్ధాలు చెబితే వెంట పడాలన్నారు. జీవన్ రెడ్డి ఇకపై టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బీజేపీ వాళ్లతో కబడ్డీ ఆడుతాడని అన్నారు. ఇజ్రాయిల్‌లో ఉన్న స్కీమ్‌ను నిజామాబాద్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -21 ద్వారా అమలు చేస్తున్నామని చెప్పారు. బీజేపీ వాళ్లు ఏమీ చేయలేని దద్దమ్మలని ఎద్దేవా చేశారు. బీజేపీ వాళ్లు గ్రా మాలకు వచ్చి మాట్లాడితే ప్రజలు చీపుర్లతో కొట్టాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టం. ఇక్కడి ప్రజలు మాత్ర మే సుఖశాంతులతో బతుకుతున్నారు. అనేక సంక్షే మ పథకాలను ప్రవేశపెడుతూ అందరినీ ఆదుకుంటున్నారు. బంగారు తెలంగాణ బాట లో నడుస్తున్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డితో జిల్లా అభివృద్ధి చెందుతుంది. జీవన్‌రెడ్డిని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు సీఎం కేసీఆర్,కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
-షకీల్, బోధన్ ఎమ్మెల్యే
నగరమంతా గులాబీమయమైంది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినం రోజున టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డికి స్వాగతం పలుకడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.
– బిగాల గణేశ్గుపా, అర్బన్ ఎమ్మెల్యే
2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు విజయోత్సవ ర్యాలీని చూసినట్లు ఉంది. కేసీఆర్ కారణజన్ముడు. ఆయన పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచమంతా జరుపుకొంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనూ వేడుకలు జరుపుకొంటున్నారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకువచ్చిన వీరుడు కేసీఆర్.
– దాదన్నగారి విఠల్‌రావు, జడ్పీ చైర్మన్
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం అంటే తెలంగాణ ప్రజలకు పండుగదినం. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జీవన్‌రెడ్డికి శుభాకాంక్షలు.
-వీజీ గౌడ్, ఎమ్మెల్సీ