నిజామాబాద్ స్పోర్ట్స్/ బాన్సువాడ/ చందూర్, డిసెంబర్ 31: ఆంగ్ల నూతన సంవత్సరం 2024కు స్వాగతం తెలుపుతూ నియోజకవర్గ ప్రజలకు మాజీ సభాపతి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలు తమతమ రంగాల్లో విజయాలు సాధించి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రతిఒక్కరికీ శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని అభిలాషించారు. 2023లో ఎదురైన అనుభవాలను సానుకూలంగా మలుచుకుని 2024 నూతన సంవత్సరంలో మరింత పట్టుదల, అవిరళ కృషితో విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు.
బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలు తమ తమ రంగాల్లో విజయాలు సాధించి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరఫున అదనపు డీసీపీ జయరాం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే శాంతి భద్రతలు చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. అప్పుడే ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ మరింత బలపడి పోలీసులు, ప్రజలకు సత్సంబంధాలు ఏర్పడుతాయని పేర్కొన్నారు.