కామారెడ్డి, జూన్ 24: బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామని భారత రాష్ట్ర సమితి ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్‌షిండే, జాజాల సురేందర్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గంప గోవర్ధన్ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం బాధాకరమన్నారు. పోచారంను సీనియర్ నాయకుడిగా గుర్తించిన కేసీఆర్ 2014లో వ్యవసాయ శాఖ మంత్రిగా, 2018లో రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా అత్యున్నత పదవులు ఇచ్చి గౌరవించారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేయించినట్లు తెలిపారు. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ ఏం తక్కువ చేశాడని కాంగ్రెస్ పార్టీలో చేరారని పోచారంను ప్రశ్నించారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని, బాన్సువాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడం ఎంత వరకు న్యాయం అని అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉండి కాపాడుకుంటామని, ఎవరూ అధైర్యపడొద్దని విజ్ఞప్తి చేశారు.