KamaReddy | కామారెడ్డి : చిరు వ్యాపారులకి నష్టం చేసే రితీలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వ్యవహారం ఉందని, వారిని ఆగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ గోడకు ఆనుకొని ఉన్న చిరు వ్యాపారాల దుకాణాలను తొలగించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రెండు రోజుల క్రితం కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల పరిశీలనకు వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్ గోడకు అనుకొని ఉన్న చిరు వ్యాపార దుకాణాలను తొలగించి వారిని పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రాంతం, గంజ్ స్కూల్ ప్రాంతంలో నిర్మించనున్న భవనాల్లోకి మారుస్తామని చెప్పారన్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఇంకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని అలాంటి సందర్భంలో చిరు వ్యాపారులను ఇక్కడ దుకాణాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించడం సబబు కాదన్నారు.
ఇప్పటికే సర్వే నంబర్ 6లో గత కొన్నేళ్లుగా నివాసముంటున్న 12 మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండానే వారి రేకుల షెడ్డులను కూల్చివేయడంతో ప్రస్తుతం వారు రోడ్డున పడ్డారన్నారు. ప్రస్తుతం కూడా రైల్వే స్టేషన్ గోడకు ఆనుకొని ఉన్న చిరు వ్యాపారులకు భవనాలను నిర్మించి మడిగెలు చూపించకుండానే ఖాళీ చేయిస్తే వారు కూడా రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అభివృద్ధిని తాము అడ్డుకోవడం లేదని, దానికి ఎప్పుడూ మేము స్వాగతం పలుకుతామన్నారు. కానీ 45 ఏళ్లుగా వీటినే నమ్ముకొని బతుకుతున్న చిరు వ్యాపారులు రోడ్డున పడకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. రెండు నెలల్లో భవనాలు నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎంత త్వరగాపనులు నిర్వహించినా సంవత్సరకాలం పడుతుందన్నారు.
ఎమ్మెల్యే చూపించిన మ్యాప్ అధికారికం కాదు
ఎమ్మెల్యే రమణారెడ్డి కొత్త భవనాలు నిర్మించనున్నట్లు చూపించిన మ్యాప్ అధికారికం కాదని అది కేవలం తాను వ్యక్తిగతంగా తయారు చేసుకున్నది మాత్రమేనన్నారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా వాటిల్లనుందని చెప్పారు. ఈ మ్యాప్ ను చూపిస్తూ మున్సిపల్ నిధులతో భవన నిర్మాణాలు చేపడుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం మున్సిపల్ లో నిధుల కొరత ఉందని, సిబ్బంది వేతనాలు చెల్లించడానికే ఇబ్బందిగా ఉందన్నారు.
ఈ నిధులతో నిర్మాణాలు చేపట్టాలంటే మున్సిపల్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో తాజా మాజీ కౌన్సిలర్లు, నిమ్మ విజయకుమార్ రెడ్డి, పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, సలీం, గడ్డమీది మహేష్, మామిళ్ల రమేష్, సేవాదళ్ అధ్యక్షులు మహేష్, రంగా రమేష్, గౌరు నవీన్, ఆబిద్, బల్ల శ్రీనివాస్, మున్ను, అహ్మద్, శశి, శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.