Jeevan Reddy | ఆర్మూర్, ఆగస్టు 17 : ఆరునూరైనా ఆర్మూర్ నియోజకవర్గం తమదేనని, అన్నదాతలకు పుట్టిల్లైన ఈ గడ్డ కేసీఆర్ అడ్డా అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఆదివారం విస్తృతంగా పర్యటించిన జీవన్ రెడ్డి ఆర్మూర్ లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. ఆర్మూర్ కు శనిలా దాపురించిన కాంగ్రెస్, బీజేపీలతో తాడో పేడో తేల్చుకొని పీడ వదిలిస్తామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులు ’స్థానిక ’ యుద్దానికి సిద్ధంగా ఉన్నారని జీవన్ రెడ్డి తెలిపారు.
ఆర్మూర్ నియోజకవర్గంలోని మొత్తం 86 గ్రామ పంచాయతీలు, 36 మునిసిపల్ వార్డుల్లో బీ ఆర్ఎస్ గెలిచి తీరాలన్న కసితో పని చేద్దామని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసినట్టు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాల ను ప్రజలకు వివరిస్తామని, పదేళ్లలో ఆర్మూర్ ప్రగతికి తాము చేసిన కృషిని గుర్తు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజనిక వర్గంలో రూ.3వేల కోట్లతో అభివృద్ధి చేశా. ఇక్కడ చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చినవేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక్క విద్యుత్ సబ్సిడీలే రూ.320కోట్లు వచ్చాయని, నియోజకవర్గంలో 62 వేల మందికి రూ.2016, రూ.4016 చొప్పున ఆసరా పెన్షన్లు అందుతున్నాయని చెప్పారు. 62 వేల మందికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందుతోంది. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ చౌరస్తాలను సుందరీకరించామన్నారు. సిద్ధులగుట్ట కు రూ.20కోట్లతో ఘాటు రోడ్డు వేయించానని, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశా. సిద్ధులగుట్టను దేశంలోనే అధ్బుతమైన శివాలయంగా, పర్యాటక స్థలంగా తీర్చి దిద్దామని చెప్పారు. రూ. 120 కోట్లతో పంచగూడ వంతెన కట్టించి నిజామాబాద్-నిర్మల్ జిల్లాల మధ్య దూరం తగ్గించానని, నియోజకవర్గమంతా రూ. 500 కోట్లతో రోడ్లు వేయించానని పేర్కొన్నారు.
ఆర్మూర్- నిజామాబాద్, నిజామాబాద్- మాక్లూర్ కు రోడ్లు నిర్మించామని జీవన్ రెడ్డి వివరించారు. ఆర్టీసీ, ఆలూరు, వెల్మల్, నందిపేట్ సహా తొమ్మిదికి పైగా బైపాస్ రోడ్లు వేయించామని, ఆర్మూర్ కు వంద పడకల ఆసుపత్రి సాధించామని, ఈ దవాఖానలో ఇప్పటికే 25 వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి కేసీఆర్ కిట్లు అందించామని ఆయన పేర్కొంటూ ఉచిత ప్రసవాల వల్ల ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున ఖర్చు తప్పిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న 25వేల మందికి పైగా సీఎం ఆర్ ఎఫ్ నిధులు మంజూరు చేయించానని ,మరో అయిదు వేల మందికి ఎల్వోసీ చెక్కులు ఇప్పించి వారి ప్రాణాలు కాపాడానని, తన దగ్గరకు వచ్చి అడిగిన వెంటనే ప్రయివేటు ఆసుపత్రులలో డిస్కౌంట్ ఇప్పించానని ఆయన చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు ఫంక్షన్ హాళ్లు నిర్మించామని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ ను రెవెన్యూ డివిజన్ చేశామని, కొత్తగా డొంకేశ్వర్, ఆలూరులను మండలాలను సాధించానని తెలిపారు.
ఏ కారణం చేతనైన రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు రైతుబీమా వచ్చిందని, రూ.450 కోట్లు ఖర్చు చేసి మొత్తం నియోజకవర్గంలోని 86 గ్రామాలకు, 36 వార్డులకు ఇంటింటికీ మిషన్ భగీరథ మంచి నీళ్లు సరఫరా చేశామని, గురుకుల పాఠశాలల్లో ఏడాదికి ఒక్కొక్క విద్యార్థికి రూ.లక్షా 25వేల చొప్పున ఖర్చు చేస్తూ ఇంగ్లీషు మీడియంలో విద్య నేర్పించామని ఆయన పేర్కొన్నారు. రూ. 120కోట్లతో పత్తేపూర్-చేపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సాధించానన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఒక లక్షా 116 రూపాయల చొప్పున ఇస్తూ 15వేల నుంచి 20వేల మంది పేదింటి ఆడ పిల్లల పెండ్లిండ్లు జరిపించామన్నారు .గుండ్ల చెరువు ట్యాంక్ బండ్ ను అభివృద్ధి చేశానని,నాయీ బ్రాహ్మణ, రజక సోదరులకు ఉచిత విద్యుత్ సరఫరా చేశామని ఆయన వివరించారు. 20నెలల్లోనే ఆర్మూర్ ను అంధకారమయం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆర్మూర్ నియోజకవర్గం పురోగతి కోల్పోయి అధోగతిపాలైందని, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నిర్వాకం వల్ల నియోజక వర్గంలో అభివృద్ధి, ప్రజాసంక్షేమం మాయం కాగా కాంగ్రెస్ అధికార దూరంహకారం రాజకీయ ప్రత్యర్ధులపై కక్ష సాధింపులు, వేధింపులమయం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ది అవినీతి, బీజేపీది దుర్నీతి.ప్రజల బాధలు పట్టని బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్ కు శాపంగా మారిండని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం గిట్టని అధికార కాంగ్రెస్ నేతలు అవినీతి భూతాలుగా మారారని, ఆర్మూర్ అభివృద్ధికి ఆణాపైస తేలేని దద్దమ్మలు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీజేపీకి వేసిన ఓటు ఆర్మూర్ ప్రగతికి చేటుగా పరిణమించిందని, కాంగ్రెస్ కు ఇచ్చిన అధికారం జనం కళ్ళలో కారం కొట్టిందని అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన ఆర్మూర్ కు స్వర్ణయుగమన్నారు. ప్రజల బాధలు పట్టని బీజేపీ ఎమ్మెల్యే ఆర్మూర్ కు శాపంగా మారారని, అభివృద్ధి, సంక్షేమం గిట్టని బీజేపీ,కాంగ్రెస్ లకు చోటులేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అవినీతి తప్ప అభివృద్ధి పట్టని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ రెడ్డి ల ఆగడాలను ప్రజలు భరించే పరిస్థితి లేదన్నారు. ఆర్మూర్ అభివృద్ధికి ఆణాపైస తేలేని దద్దమ్మ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ను మట్టికర్పించడ మే ధ్యేయంగా పోరాడుతానన్నారు. కేసీఆర్ సీఎంగా మళ్లీ చూసేందుకు ప్రతీ ఒక్కరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.