తెలంగాణ వరప్రదాయిని ప్రపంచ ప్రసిద్ధ కాళేశ్వరం ద్వారా రాష్ర్టాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర భగీరథుడు కేసీఆర్‌కు కారాగారమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎల్ఈడీ తెరపై వీక్షించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, ముఖ్య నేతలతో కలిసి జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.
-ఖలీల్‌వాడి, ఆగస్టు 5
అవినీతి బయోపిక్..
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కాంగ్రెస్ అవినీతి బయోపిక్‌లా ఉందని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తడారి ఎడారిగా మారిన తెలంగాణ భూములు పచ్చ బాడేలా చేసిన కాళేశ్వరం జలధారలను చూసి కాంగ్రెస్ నాయకుల కండ్లు ఎర్రబారుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన చూస్తుంటే ఆనాడు భద్రాచలంలో రామమందిరం నిర్మించిన రామదాసును జైల్లో పెట్టినట్లు తెలంగాణ ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్‌ను కూడా జైలులో పెట్టాలని కుట్ర చేస్తున్నట్లుందన్నారు. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అంటారని, కానీ అందుకు విరుద్ధంగా కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ చేసి శిథిల శివాలయంలా మారిన శ్రీరామ్‌సాగర్ కు పునరుజ్జీవమిచ్చిన జలప్రధాత కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు.
మండుటెండల్లో కూడా చెరువులను మత్తళ్లు దూకించిన మహనీయుడు కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. కాళేశ్వరాన్ని పండబెట్టి, తెలంగాణ ను ఎండబెట్టి గోదావరి నీరు బనకచర్లకు చేరేలా కాంగ్రెస్ కంకణం కట్టుకుందని ఆయన ఆరోపించారు. తెలంగాణను సర్వనాశనం చేసి చంద్రబాబుకు గురుదక్షిణం చెల్లించుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుతంత్రాలు చేస్తున్నారని, ఇందుకు అడ్డంగా ఉన్న కేసీఆర్ ను అడ్డు తొలగించుకునే కుట్రలో భాగమే కాళేశ్వరం కమీషన్ అని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.
బోగస్ నివేదిక..
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ సృష్టించిన అపోహలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హరీశ్‌రావు పటాపంచలు చేశారని జీవన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ ఇచ్చిన బోగస్ నివేదిక ఆధారంగా కేసీఆర్ జోలికొస్తే ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు. కేసీఆర్‌పై కక్ష సాధిం పు చర్యలు, ఎలాగైనా ఆయనను అరెస్టు చేసి జైలులో పెట్టాలని రేవంత్ ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టకపోతే తెలంగాణ చరిత్ర తిరగరాసేలా మరో మహా సంగ్రామాన్ని లేవదీస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ఎదుర్కోవడానికి ప్రజలతో కలిసి మహాయుద్ధం చేయడానికి గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు.
‘స్థానిక’ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాటకాలు
-ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి
రేవంత్‌రెడ్డి పాలనను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. కాంగ్రెస్ మాయలో పడి మం చి నాయకుడైన కేసీఆర్‌ను గెలుపించుకోలేక పోయామని జనం ఇప్పుడు అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమవుతుంది. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో, పాడి పంటలతో సంతోషంగా ఉండాలనే సదుద్దేశంతో అప్పటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు.
రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నింపిన ఘనత ఆయనది. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ జనాల్ని బురిడీ కొట్టించింది. అనేక హామీలిచ్చి ఏ ఒక్కటీ సరిగా అమలు చేయడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే. అందుకే రాష్ట్ర ప్రభుత్వ హామీలపై బీజేపీ నేతలు ప్రశ్నించడం లేదు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అదే కాళేశ్వరం నుంచి నీటిని తరలించి రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూసుకుంటాం.
బీఆర్ఎస్ ఉండొద్దనే కాంగ్రెస్, బీజేపీ కుట్రలు
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా
కాళేశ్వరం మీద బురద చల్లడాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సైన్యం సిద్ధంగా ఉన్నది. ఎవరెన్ని కుట్రలు పన్నినా చివరకు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే. సిగ్గు లేని రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ మీద పడుతున్నాయి. రాష్ట్రంలో విపక్షంలో ఉన్న బీజేపీ నేతలకు దమ్ముంటే కాంగ్రెస్ హామీలపై నిలదీయాలి. కాంగ్రెస్ నేతల అవినీతి మీద మాట్లాడాలి. అనవరసరంగా కేసీఆర్ కుటుంబంపై, కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దని కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కేవలం 1.07 శాతం ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. కాళేశ్వరం చూపించి కాంగ్రెసోళ్లు గెలిచారు. ఇప్పుడదే కుట్రతో మళ్లీ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి కట్టినట్లు కట్టి వస్తామని చెబుతున్నారు.. రండి మీ అందరికీ స్వాగతం పలుకుతాం. అన్ని పార్టీలు కలిసి వచ్చినా బీఆర్ఎస్ను ఏమీ చేయలేవు.