నిజాంసాగర్, మే 15: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అకాల వర్షానికి వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా మహ్మద్‌నగర్ మండలం కొమలంచ గ్రామంలో బుధవారం అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ధాన్యం తూకం వేయకుండా, తూకం వేసిన ధాన్యం తరలించకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల తీరుకు నిరసనగా కొమలంచ గేటు వద్ద బోధన్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఐదు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని, రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ధాన్యం తడుస్తున్నదని తెలిపారు.
ఉన్నతాధికారులు వచ్చి తమ సమస్య పరిష్కరించే వరకు ధర్నా విరమించబోమని స్పష్టం చేశారు. సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని ధర్నా విరమించాలని కోరగా ఉన్నతాధికారులు వచ్చి కొనుగోలు కేంద్రాల్లో కాంటాల సంఖ్య పెంచి లారీల కొరత తీరుస్తామని హామీ ఇచ్చేవరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకూర్చున్నారు. తహసీల్దార్ క్రాంతికుమార్ చేరుకొని కాంటాల సంఖ్య పెంచి, లారీల కొరత తీరుస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో గంగారెడ్డి, సత్యనారాయణ, బాల్ రెడ్డి, నారాయణ, రాజు, విఠల్ గౌడ్, జైపాల్ కుమార్, సాయిలు, రైతులు పాల్గొన్నారు.
గత పది సంవత్సరాల నుంచి ఇలాంటి ఇబ్బంది రాలేదు. మేము కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం పది రోజుల నుంచి తూకం చేయడం లేదు. సొసైటీ వాళ్లను అడిగితే రైస్‌మిల్లర్లు వద్దని చెబుతున్నారని సమాధానం ఇస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి మా రైతులను ఆదుకోవాలి.
నాలుగు ఎకరాల్లో పంట పండించి నెలరోజులవుతున్నది. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి పది రోజులైనా పట్టించుకునే వారు లేరు. వర్షానికి ధాన్యం తడిసింది. మొలకలు వస్తున్నాయి. అధికారులు స్పందించి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి.
మార్కెట్‌కు వడ్లు తీసుకవచ్చి నెల రోజులు అవుతున్నది. సంచులు నింపుతలేరు. లారీలు పంపుతలేరు. వానకు మొలకలు వస్తున్నాయి. మార్కెట్లో సంచికి రెండు కిలోల తరుగు తీస్తున్నారు. రైస్‌మిల్లుకు పోయినంక వారి ఇష్టం వచ్చినంత తీస్తున్నారు. గత పదేండ్లలో ఇట్ల జరగలేదు. అధికారులు కూడా పట్టించుకుంటలేరు.