పదేండ్ల కిందట దర్శనమిచ్చిన డ్రమ్ములు, నీటి ట్యాంకర్లు మళ్లీ కనిపిస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీల్లో తాగునీటి ఎద్దడి నెలకొన్నది. కొన్ని ప్రాంతాల్లో ఐదురోజులకోసారి, మరికొన్ని చోట్ల వారానికి రెండుసార్లు మాత్రమే నీటి సరఫరా అవుతున్నది. కామారెడ్డి మున్సిపాలిటీలోని ప్రజలు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సరఫరాలో ఇబ్బందులు, పైపులైన్ లీకేజీ తదితర సమస్యలు అధికంగా ఉంటున్నాయి.
– కామారెడ్డి, జూలై 14
కామారెడ్డి పట్టణంలో తెలంగాణ రాక ముందు చాలా కాలనీల్లో నీటి సమస్యలు చాలా ఉండేవి. రోడ్లపై నీటి డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని మున్సిపల్ నీరు వచ్చే వరకు ఎదురుచూసేవారు. 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ గ్రామాలు, పట్టణాల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేశారు. కామారెడ్డి పట్టణంలోని చాలా కాలనీల్లో నీటి సమస్య లేకుండా చేశారు. కానీ ఇటీవల నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. సాక్షాత్తూ ప్రభుత్వ సలహాదారు ఇంటికి కూతవేటు దూరంలోనే నీటి సమస్య అధికంగా ఉన్నది.
అధికార పార్టీకి చెందిన నేత ఇంటికి సమీపంలోని కాలనీల పరిస్థితి ఇలా ఉంటే.. మిగతా కాలనీల్లో సమస్య ఎంత మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇటీవల నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ నీటి సమస్యపై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
కామారెడ్డి పట్టణంలో సుమారు లక్షా 20 వేల మందికి మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేపడుతున్నారు. ఇందుకోసం 10 ఎంఎల్డీ నీరు అవసరం ఉండగా 3 ఎంఎల్డీ మాత్రమే సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీ, బతుకమ్మ కుంట కాలనీలో ఐదు రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది కౌన్సిలర్లు ట్యాంకర్ ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో చాలా మంది కాలనీవాసులు డ్రమ్ముల ద్వారా నీటిని నింపుకొని వాడుకుంటున్నారు. పట్టణంలో ప్రజలకు సరిపోయేలా నీటి సరఫరా లేకపోవడంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల 17 సంవత్సరాల క్రితంనాటి నాసిరకం పైపులను బిగించడంతోనే అవి పగిలి నీటి సమస్య ఎక్కువవుతున్నట్లు తెలుస్తున్నది.

మా కాలనీలో రోజు తప్పి రోజు నల్లా వస్తుంది. అది కూడా కొద్దిసేపు మాత్రమే వస్తుంది. నీటి సమస్య అధికంగా ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలి.
-సురేశ్, పంచముఖి హనుమాన్ కాలనీ
మా కాలనీలో నీటి సమస్య అధికంగా ఉండడంతో కౌన్సిలర్లు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ట్యాంకర్లు వచ్చినప్పుడు డ్రమ్ముల్లో నీటిని నింపుకొంటున్నాం. మున్సిపల్ అధికారులు వెంటనే నీటి సమస్యను తీర్చి మా ఇబ్బందులను తొలగించాలి.
-కిష్టయ్య,పంచముఖి హనుమాన్ కాలనీ
మా కాలనీలో బోర్లు వేసినా.. ఎక్కువ సేపు నీరు వస్తలేవు. నల్లాలు కూడా రోజూ రావడం లేదు. దీంతో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా అధికారులు వెంటనే నీటి సమస్యను తీర్చాలి.
-భారతి, పంచముఖి హనుమాన్ కాలనీ
కామారెడ్డి పట్టణంలో 10 ఎంఎల్డీ బదులు 3 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయడంతో ప్రజలకు నీటి సమస్య ఏర్పడుతున్నది. పైపులైన్ కూడా చాలా రోజులు కావడంతో పగిలిపోతున్నాయి. దీంతో రోడ్లపై నీరు వృథాగా పోతున్నది. త్వరలో నీటి సమస్యకు యాక్షన్ ప్లాన్ చేస్తున్నాం. త్వరలో ప్రజలకు నీటి కష్టాలు తొలగిపోతాయి.