పొతంగల్, మార్చి 9: మండలంలోని కల్లూర్లో తాగునీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిందెడు నీటి కోసం మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు. తాగునీటి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ఓ కాలనీలో పదిహేను రోజులుగా తాగు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
కాలనీలో సుమారు వంద కు పైగా ఇండ్లు ఉన్నాయి. అధికారులు, వాటర్ మన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ మహిళలు, ప్రజలు ఆదివారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. నీళ్ల కోసం పనులు మానుకొని రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
నీళ్ల కోసం రోజు పడిగాపులు
15 రోజుల నుంచి బిందెడు నీళ్ల కోసం నానా తంటాలు పడుతున్నాం.
దూరంగా ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నాం. దినంలో నల్లాలు ఎప్పుడొస్తాయో తెలియక రాత్రింబవళ్లు నీళ్ల కోసం పనులు మానుకొని పడిగాపులు కాస్తున్నాం. గ్రామానికి వచ్చే అధికారిని అడిగితే పట్టించుకోవడం లేదు. మా నీటి గోస ఎవరికి చెప్పుకోవాలో సమజైతలేదు. దండం పెట్టి అడుతున్నా పెద్దసార్లు జర నీటి సమస్య తీర్చాలి.
-తెనుగు లింగవ్వ, కల్లూర్
ప్రత్యేకాధికారి రారు.. పట్టించుకోరు
ప్రత్యేకాధికారుల పాలన వచ్చినప్పటి నుంచి గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు పారిశుద్ధ్య పనులు పట్టించుకోవడం లేదు. వీధి లైట్లు వెలగడం లేదు. గ్రామానికి పుష్కలంగా నీరు అందించే అవకాశం ఉన్నా.. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాగు నీటి సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
-మక్కయ్య, కల్లూర్,