ఆర్వోబీ నిర్మాణ పనులు కొనసాగుతున్న ప్రదేశంలో బైపాస్ మూలమలుపు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. రాత్రివేళ వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. అక్కడ స్ట్రీట్‌లైట్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో కొత్తగా వచ్చే వాహనదారులు ఎటువైపు వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
డిచ్పల్లి, జూలై 31: నత్తకు నడకనేర్పుతున్నట్లుగా సాగుతున్నాయి మాధవనగర్ రైల్వే గేటు వద్ద చేపట్టిన ఆర్వోబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జి) పనులు. పనులు ఏండ్లకేండ్లుగా సాగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో రూ.93.12 కోట్ల నిధులతో నిజామాబాద్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై మాధవనగర్ రైల్వే గేటు వద్ద ఆర్వోబీ నిర్మాణ పనులు చేపట్టారు.
బ్రిడ్జి నిర్మాణం ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి పూర్తి కావాల్సి ఉండగా.. ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నా యి. త్వరగా ఆర్వోబీ పనులు పూర్తయి రైల్వే గేటు బాధలు తప్పుతాయని ఆశ లు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. నిర్మాణ పనులు ప్రారంభమై మూడేండ్లు గడుస్తున్నా కేవలం పిల్లర్ల వరకే పనులు పూర్తికావడం గమనార్హం. సాయిబాబా ఆలయం వైపు పిల్లర్లపై వంతెన పనులు పూర్తయ్యాయి.
ఈ మార్గంలో నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జాప్యంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు నిర్మాణ గడువు పెంచిన ప్రభుత్వం.. మూడోసారి ఈ ఏడాది డిసెంబర్ 31వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించింది. మూడేండ్లుగా అసంపూర్తిగా ఉన్న ఆర్వోబీ నిర్మాణ పనులు ఈ ఐదు నెలల్లో పూర్తవుతాయనే నమ్మకం లేదని ప్రజలు భావిస్తున్నారు.
అడుగడుగునా గుంతలు..
మాధవనగర్ రైల్వే గేటు మీదుగా నిత్యం 40 కి పైగా రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. గేటు పడిన ప్రతిసారీ ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోతాయి. గేటు తీయగానే ఒక్కసారిగా రెండు వైపుల నుంచి వాహనాలు పట్టాలు దాటేందుకు రావడంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. మరోవైపు ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వంతెన పొడువునా రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి.
ఈ గుంతల్లో వర్షపునీరు నిలిచి వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో పడి అదుపుతప్పిన పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన సందర్భాలూ ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు స్పందించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకువచ్చి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.
నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
మాధవనగర్ వద్ద కొనసాగుతున్న ఆర్వోబీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి. ఇప్పటికే పనులు ప్రారంభమై మూడేండ్లు గడిచినా సగం కూడా పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. వంతెన వద్ద రోడ్డు పూర్తిగా గుంతలతో నిండిపోయింది. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు.
-ముల్క దామోదర్,డిచ్పల్లి.
తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం..
డిచ్పల్లి నుంచి నిజామాబాద్ మధ్య రాకపోకలకు మాధవనగర్ వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి రోజూ 40కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రతి అరగంటకు ఒకసారి గేటు పడుతుంది. గేటు వేస్తే సుమారు 20 నిమిషాలు వేచి చూడాల్సి వస్తున్నది. వంతెన వద్ద రోడ్డు పూర్తిగా గుంతలు పడి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురువుతున్నారు. త్వరగా ఆర్వోబీ నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.
– రాజ్‌కుమార్ షిండే, డిచ్పల్లి