రెంజల్, అక్టోబర్ 7 : నిర్ణీత సమయానికి బస్సులు నడపాలని కోరుతూ మండలంలో ని కందకుర్తి గ్రామంలో విద్యార్థులు మంగళ వారం ఆందోళన చేపట్టారు. బస్సుకు అడ్డం గా నిలబడి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. గ్రామా న్ని ఆర్టీసీ రికార్డులో మహారాష్ట్రలో చేర్చారని ఆరోపించారు. నిజామాబాద్ -1 డిపోకు చెందిన బస్సు కందకుర్తి వరకు వస్తున్నా, సమయానికి రాకపోవడంతో తాము తరగతులు కోల్పోతున్నామని వాపోయారు.
ఈ విషయమై ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. బస్సులను ఇష్టానుసారంగా నడపడంతో రెంజల్ హైస్కూల్, ఆ దర్శ పాఠశాల హెచ్ఎంలు టీసీ ఇచ్చి పంపుతామని చివాట్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయం 8 గంటలకు రావాల్సిన బస్సు 11 గంటలకు ఆలస్యంగా రావడంతో పరీక్షలు రాసేదెలా అంటూ ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. సమయానికి బస్సులు రాక చదువుకు దూరమైపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సమయానికి బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.