చెరువులకు చేపపిల్లలు చేరుతాయా? లేదా? అన్న మీమాంసలో మత్స్యకారుల కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో సమయానికి చేపపిల్లలు రావడంతో జలాశయాల్లో మత్స్య సంపద వృద్ధి చెంది చేతినిండా ఆదాయాన్ని ఆర్జించాయి. వానాకాలం ప్రారంభమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ చేపపిల్లల పథకంపై దృష్టి సారించినట్లుగా కనిపించడం లేదు.
ఒకవేళ ప్రభుత్వం ఈ విషయంలో ప్రోత్సాహం అందించకపోతే మా పరిస్థితి ఏమిటంటూ మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ తీసుకువచ్చిన పథకాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 2016-17లో మొదలైన ఈ మత్య్స అభివృద్ధి కార్యక్రమం నిరాటంకంగా ఎనిమిది విడుతలు కొనసాగింది. 2024-25లో అమలుపైనే నీలినీడలు అలుముకున్నాయి.
-నిజామాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
చెరువులు, కుంటలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో చేపపిల్లల పెంపకానికి మత్య్సకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించింది. 100శాతం రాయితీతో చేపపిల్లల విత్తనాన్ని అందించడంతో వారికి కొండంత భరోసాతోపాటు మత్స్యకారుల కుటుంబాలకు వెన్నుదన్నుగా కేసీఆర్ నిలిచారు. దీంతో గ్రామాల్లోని మత్స్యకారులు ధైర్యంగా బతికారు. 2014కు మునుపు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో వీరిని పట్టించుకున్నవారే కరువు. కనీసం రాయితీతో చేపపిల్లలను అందించకపోవడంతోపాటు చెరువులపై అజమాయిషీ చేసేందుకు సైతం మత్స్యకారులకు అవకాశం లేకపోయేది.
రాష్ట్రం ఏర్పడి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మిషన్ కాకతీయతో బాగుపడిన చెరువుల్లోకి చేపపిల్లలను వదిలారు. దీంతో మత్స్య అభివృద్ధికి కేసీఆర్ బాటలు వేశారు. 2024-25 సీజన్ ప్రారంభం నుంచి వానలు కొద్దిగా ముఖం చాటేసినప్పటికీ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో చెరువుల్లోకి జలాలు వచ్చి చేరుతున్నాయి. వేలాది చెరువులు, కుంటలు మత్స్య అభివృద్ధికి దోహదం చేసేలా అనుకూలంగా మారుతున్నాయి. నీళ్ల బెంగ తీరుతున్న ఈ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత చేపిపిల్లలు వచ్చేనా? అనే అనుమానాలు కొట్టుమిట్టాడుతున్నాయి.
చేపపిల్లల అభివృద్ధికి ఆయువు పోసేందుకు కేసీఆర్ హ యాంలో ప్రణాళికబద్ధంగా రూపకల్పన జరిగింది. మొదటగా మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను బాగుచేశారు. బాగుపడిన జలాశయాల్లో 20 16-17లో తొలి విడుతలో చేపపిల్లలను వదిలారు. ఆ త ర్వాత పునరుద్ధరణకు నోచుకున్న చెరువులన్నింటినీ గుర్తిం చి ప్రక్రియ కొనసాగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చివరిసారిగా ఎనిమదో విడుత 2023-24లో జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలో 1,018 చెరువుల్లో 4కోట్ల 72లక్షల చేపపిల్లలను వదిలారు.
10లక్షలకు పైగా రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించారు. కామారెడ్డి జిల్లాలోనూ 697 చెరువుల్లో 2కోట్ల 78లక్షల 60వేల చేపపిల్లలను వదిలి మత్య్స అభివృద్ధికి పాటుపడ్డారు. చెరువుల్లో చేపపిల్లలను వదిలే సమయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీ బాధ్యుల సమక్షంలో సైజులు, చేప పిల్లల నాణ్యతను నిర్ధారించిన తర్వాత మాత్రమే చెరువుల్లోకి వదిలిపెట్టేలా మత్స్య శాఖ చర్యలు తీసుకున్నది. తద్వారా పారదర్శకంగా కార్యక్రమాన్ని చేపట్టింది.
చందూర్, ఆగస్టు 4: పదేండ్ల నుంచి చెరువునే నమ్ముకొని బతుకుతున్నాం. గత ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం రూ.కోట్లు నిధులు మంజూరు చేసి చేపపిల్లలను చెరువులో ఉచితంగా వదిలింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను విడుదల చేసి సహకరిస్తే మాకు ఉపాధి కల్పించిన వారవుతారు.
– కొల్లూరి లాలాబోయి, ఘన్పూర్
వారం రోజుల్లో చేపపిల్లల ఉత్పత్తి పనులు ప్రారంభమవుతాయి. ఈసారి 55లక్షల చేపపిల్లల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించాం. రూ.5.75లక్షల నిధులు సమకూర్చాలని ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఏప్రిల్-మే నెలల్లోనే నిధులు మంజూరయ్యేవి. ఈసారి ఇంకా రాలేదు. ఎఫ్డీవోల బదిలీలు జరగడంతో ఇక్కడ ఎఫ్ఎఫ్వోకు ఇన్చార్జి ఇచ్చాం. ప్రస్తుతం అతను సెలవుపై వెళ్లాడు, త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చూస్తాం.
– ఆంజనేయులు, ఏడీ మత్స్యశాఖ