భీమ్‌గల్, జూలై 4: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) కార్యక్రమం గందరగోళంగా మారింది. ఓటర్ జాబితాల ప్రక్షాళన కోసం చేపట్టిన ఈ ప్రక్రియ కాస్త అనేక సందేహాలకు, అంతులేని ప్రశ్నలకు, అంతకు మించి అయోమయానికి గురి చేస్తున్నది. ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలి? పాత ఓటర్ జాబితాల్లో పేర్లు లేకపోతే ఎలా? ఇండ్లు మారిన వారి పరిస్థితి ఏమిటి? ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారి ఓటు ఉంటుందా? స్థానికంగా లేని వారు ఏం చేయాలి? వంటి సందేహాలెన్నో నెలకొన్నాయి. అయితే, ‘సర్’పై ప్రజలు, రాజకీయ పార్టీలతో పాటు బీఎల్వోలకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం, అవగాహన కరువైన తరుణంలో సవరణ ప్రక్రియ ప్రహసనంగా మారింది. అదే సమయంలో ఓటర్ జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు దక్కవనే ప్రచారం కాస్త ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది.
బీఎల్వోలు గత నెల 25 నుంచి ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. కానీ వారికి ఓటర్లను గుర్తించడం పెద్ద ప్రహసనంగా మారింది. పాత ఓటర్ల జాబితాలు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడమే ఇందుకు కారణం. ఒకే ఇంట్లోని ఓట్లు వేర్వేరు బూత్‌లలో ఉండడం, ఎవరి వద్దా సరైన సమాచారం లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికీ చాలా చోట్ల పూర్తి స్థాయిలో ఎన్యూరేషన్ ఫారాలు అందడంలేదు. దీంతో ఓటర్లు అనవరమైన భయాందోళనకు గురవుతున్నారు. ఓటు హక్కు లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ లబ్ధి చేకూరదన్న పుకార్ల నేపథ్యంలో ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కానీ వారి భయాలను, అనుమానాలను నివృత్తి చేసే వారు కానీ, ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో వారికి సహాయ పడే వారు కానీ లేకపోవడం ప్రహసనంగా మారింది.
ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసేందుకు బీఎల్వోలు అయోమయానికి గురవుతున్నారు. కొన్నిచోట్ల ఓటర్ల ఇంటి నంబర్లు, చిరునామాలు ఓటర్ల జాబితాలో తప్పుగా నమోదు కావడమే దీనికి కారణం. పైగా బీఎల్వోలకు ఏ ఓటరు ఇల్లు ఎక్కడ ఉందో తెలియక తికమకపడుతున్నారు. దీంతో తప్పనిసరై స్థానిక రాజకీయ నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలపైన ఆధారపడుతున్నారు. గత నెల 25న ప్రారంభమైన ఈ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటికీ పూర్తి కాలేదు. పెద్ద సంఖ్యలో ఫారాలు బీఎల్వోల వద్దనే ఉండిపోయాయి. కొంత మంది బీఎల్వోలు క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి పత్రాలు అందజేయడం లేదని తెలిసింది. ఒకచోటనే కూర్చుని తెలిసిన స్థానిక ప్రజాప్రతినిధులకు, పార్టీల నేతలకు ఫారాలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిన్నాయి.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సోషల్ మీడియా గ్రూపులలో రకరకాల వార్తలు వాప్తి చెందుతున్న నేపథ్యంలో ఓటర్లలో ఒకింత ఆందోళన నెలకొంది. ఓటు లేకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ప్రచారానికి తోడు ఇప్పుడు గనక ఓటర్ జాబితాలో పేరు చేర్చుకోకుంటే భవిష్యత్తులో ఓటు హక్కు నమోదు చేసుకోవడం కష్టసాధ్యమన్న వార్తలు వారిని మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో స్థానిక వాట్సాప్ గ్రూప్‌లలో వచ్చిన బీఎల్వోల వివరాలు, ఫోన్ నంబర్ల జాబితాను చూసుకుని, బీఎల్వోలకు ఫోన్ చేసి మరీ వారు ఎక్కడ ఉన్నారో కనుక్కుని తమ ఓటు నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పూర్తిగా అయోమయంగా మారడంతో రాజకీయ పార్టీలు, స్థానిక నాయకులు రంగంలోకి దిగారు. ఎవరి ఓటు బ్యాంకును వారు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా పార్టీల బూత్ కన్వీనర్లు పాత ఓటర్ల జాబితాను పట్టుకుని ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. లేకపోతే ఎన్నికల సమయంలో తమకు ఇబ్బందులు తప్పవని వారు భావిస్తున్నారు. సర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చాయి. ఓటర్ జాబితాల సవరణ ప్రక్రియ గురించి అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన వారి ఓట్లు పోకుండా చూడడంపై దిశానిర్దేశం చేశాయి.