నాగిరెడ్డిపేట్, నవంబర్ 9: మానవాళికి ప్రాణవాయువును అందించడంతోపాటు సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు చెట్లు అవసరం. అడవులు క్రమంగా అంతరిస్తున్న తరుణంలో విరివిగా మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ప్రజలను భాగస్వామ్యం చేసి వృక్ష సంపదను వృద్ధి చేసేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలను అందిస్తున్నది. ఏటా వానకాలంలో హరితహారం కార్యక్రమం చేపట్టి ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన మొక్కలు నాటి సంరక్షించడంతో పల్లెలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. వీటితోపాటు పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఊరూరా ఏర్పాటు చేసిన విలేజ్ పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఏడు విడుతలుగా ..
హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలతో నాగిరెడ్డిపేట్ మండలంలోని జలాల్పూర్ గ్రామం పచ్చదనం సంతరించుకున్నది. ఏడేండ్ల పాటు చేపట్టిన హరితహారం కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చింది. ఏపుగా పెరిగిన మొక్కలు గ్రామానికే కొత్త అందాన్ని తెచ్చాయి. గ్రామంలో ఏటా 10 వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. గ్రామంలో 4 వేల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేసి ప్రజలతో నాటించారు. దీంతోపాటు గ్రామంలోని 22గుంటల స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల పూలు, పండ్లు, నీడనిచ్చే 12 వందల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పార్కులో వాకింగ్ ట్రాక్‌తోపాటు సందర్శకులు సేద తీరేందుకు బల్లాలను సైతం ఏర్పాటు చేశారు. గతంలో పట్టణాలకే పరిమితమైన పార్కులు నేడు పల్లెల్లోనూ కనిపిస్తున్నాయి.
మొక్కల సంరక్షణలో ఇద్దరు ..
జలాల్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రకృతివనంలో ఇద్దరు వన సంరక్షకులను నియమించి మొక్కలను కంటికిరెప్పలా కాపాడుతున్నారు. ఎప్పటికప్పుడు కలుపు తీయించడంతోపాటు చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రంగా ఉంచుతున్నారు. ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేసి ఉదయం, సాయంత్రం వేళల్లో మొక్కలకు నీరందిస్తున్నారు.