పల్లెల్లో స్థానిక ఎన్నికల కోలాహలం నెలకొన్నది. దేశాభివృద్ధిలో కీలక భాగస్వామ్యమైన గ్రామాలు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం పూర్తయినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలనకు మొగ్గుచూపింది. దీంతో పంచాయతీలు అస్తవ్యస్తంగా మారి ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడింది. మూడు నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఉమ్మడి జిల్లాలో ‘స్థానిక’ సందడి
-నిజామాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
స్థానిక సంస్థలను కేసీఆర్ ప్రభుత్వం బలోపేతం చేసింది. పంచాయతీ రాజ్, పురపాలక చట్టాలను సవరించి నేటి సమాజానికి అనుగుణంగా, కాలానికి తగ్గట్లుగా రూపొందించింది. రిజర్వేషన్ అమలులోనూ ఏర్పడిన సందిగ్ధతకు చెక్ పెట్టి నూతన విధానాన్ని అమలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీ రిజర్వేషన్లపై తెచ్చిన చట్టం ప్రకారం పదేండ్లపాటు రిజర్వేషన్లు అమలులో ఉండనున్నాయి. దీని ప్రకారం పంచాయతీ ఎన్నికలు ఆరేండ్ల క్రితం నిర్వహించగా.. ఈసారి అవే రిజర్వేషన్లు కొనసాగించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానానికి మొగ్గు చూపుతుందా? లేదంటే పాత విధానాన్నే కొనసాగిస్తుందా? అనే దానిపై స్పష్టత కరువైంది.
మూడు నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సెప్టెంబర్ నెలాఖరులోపు కచ్చితంగా ఎన్నికల ప్రక్రియ పూర్తచేసేందుకు ఆస్కారం ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేవు. ప్రత్యేక అధికారులతో పాలన కుంటుపడుతోంది. ఎన్నికలు అనివార్యమైన పరిస్థితిలో హైకోర్టు తీర్పు కూడా ఉండడంతో ఆశావహులంతా గ్రామాల్లో సందడి చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచి గెలిచేందుకు ఇప్పటి నుంచే ప్రజల్లో కలియదిరుగుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం తలనొప్పిగా మారింది. కొంత మంది గత సర్కారు విధానాన్ని పాటించాలని సూచించగా.. మరికొందరు కొత్తగా రిజర్వేషన్లు తీసుకురావాలని కోరుతున్నారు. 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పాలకవర్గ పదవీకాలం 2024, ఫిబ్రవరి 1వ తేదీతో ముగియగా, ప్రస్తుతం ‘ప్రత్యేక’పాలన సాగుతోంది. రిజర్వేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానానికి మొగ్గు చూపితే ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చని అధికారులు చెబుతున్నారు.
హైకోర్టు తీర్పుననుసరించి మూడు నెలల కాల పరిమితిలోగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటే హడావుడిగా రిజర్వేషన్ల అంశాన్ని పూర్తి చేసే వీలుంది. ఇప్పటికే అధికారులు పంచాయతీల వారీగా ఓటరు జాబితాపై బీఎల్వోలతో సర్వే చేయించారు. తుది జాబితానూ సైతం ప్రచురించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడానికి ముందు మరోమారు ఎన్నికల జా బితా వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఏ క్షణాల్లోనైనా ఎన్నికలకు షెడ్యూల్ వెలువడినా ప్రక్రియను విజయవంతం చేసేందుకు యంత్రాంగం సిద్ధంగానే ఉంది.
సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన ఆశావహులు ఇప్పటి నుంచే గ్రామాల్లో కలియదిరుగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారంతా యువత, ఆయా కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకుంటున్నారు. మరి కొంత మంది విందులు ఏర్పాటు చేస్తూ పలుకుబడి ఉన్న వ్యక్తులను తమవైపు తిప్పుకుంటున్నారు. కులాల వారీగా సమీకరణాలను అంచనా వేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత డబ్బుల సర్దుబాటు చేసుకోవడం కష్టంగా మారునున్నదని భావించి ఇప్పటి నుంచే నగదును సమకూర్చుకుంటున్నారు.
ప్రస్తుతం ఆషాఢమాసం కావడంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా వన భోజనాల సందడి కనిపిస్తున్నది. దీంతో ఆశావహులు వనాలకు వెళ్లి పలుకరిస్తూ మద్యం సీసాలను అందిస్తున్నట్లు సమాచారం. వచ్చే శ్రావణమాసంలోనూ శుభ కార్యాలకు హాజరై తలలో నాలుకలా మారాలని ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నారు. సర్పంచ్ బరిలో నిలిచేవారి పేర్లు ప్రచారంలోకి వస్తుండడంతో గ్రామాల్లో రోజుకొకరు పోటీ పడుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు.
తద్వారా ఒకరిని చూసి మరొకరు తయారవుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పార్టీల వారీగా టికెట్ల కేటాయింపు ఉండడంతో నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ అధ్యక్షులతో నిరంతరం టచ్లో ఉంటూ వారి ఆశీస్సులు పొందడానికి పాకులాడుతున్నారు.