బిచ్కుంద (జుక్కల్), జూలై 26: జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిందెడు నీటి కోసం పంట పొలాల్లోని బోర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. పైపులైన్ లీకేజీ ఏర్పడడంతో వారం రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడం, గ్రామంలోని బోరు మోటర్లు కాలిపోవడంతో నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు.
బోరు మోటర్‌కు మరమ్మతులు చేపట్టకపోవడంతో పంట పొలాల్లోని బోర్ల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నా తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదని వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాలని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.