నందిపేట్, ఆగస్టు 24 : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత ఆలూరు గంగారెడ్డి కూతురు విజయభారతి సోమవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయభారతి బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా రాష్ట్రస్థాయి నాయకురాలిగా జిల్లాలో సుపరిచితురాలు. కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ బీజేపీలో పట్టున్న నాయకురాలిగా ఎదిగారు. కేసీఆర్ పాలనలో పదేండ్లలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మళ్లీ ప్రజలకు చేరాలంటే మరోమారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, అందులో తాను భాగస్వామి కావాలన్న ఆలోచనతో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఆమె తెలిపారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో పాటు ఆమె గులాబీ కండువా కప్పుకోనున్నారు.ఆర్మూర్ నుంచి సుమారు 500 వాహనాల్లో తరలివెళ్లనున్నట్లు విజయభారతి వెల్లడించారు. విజయభారతి ఇంజినీరింగ్, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని ఆర్కే పురం నియోజకవర్గం నుంచి ఆమె, భర్త స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2021లో ఆమె భర్త అరవింద్ కార్పొరేటర్‌గా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.