Telangana University | టీయూలో విజిలెన్స్ దాడులు.. ముఖ్యమైన హార్డ్‌డిస్క్‌లు, కంప్యూటర్లు స్వాధీనం
Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంగళవారం వర్సిటీలో దాడులు చేశాయి.
Telangana University | డిచ్పల్లి, జూన్ 6 :తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంగళవారం వర్సిటీలో దాడులు చేశాయి. కీలక పత్రాలతో పాటు హార్డ్‌డిస్క్‌లను సైతం స్వాధీనం చేసుకున్నాయి. గత 20 నెలల్లో జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలపై ఆరా తీశాయి. మరోవైపు, దాడుల విషయం తెలిసి వీసీ రవీందర్.. కీలక పత్రాలతో వర్సిటీ నుంచి పరారయ్యారు. అధికారులు ఆయనను వెంబడించి భిక్కనూరు వద్ద పట్టుకున్నారు. పత్రాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు రోడ్డుపైనే గంటకు పైగా వీసీని విచారించారు.
అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగంతో వివాదంగా మారిన తెలంగాణ యూనివర్సిటీపై మంగళవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పరిపాలనా భవనానికి మూడు వాహనాల్లో సుమారు 15 మందికి పైగా వచ్చిన విజిలెన్స్ అధికారులు అడ్మిస్ట్రేషన్ భవనంలోని వీసీ చాంబర్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, అకౌంట్ సెక్షన్, ఇంజినీరింగ్ విభాగాల్లో తనిఖీలు చేపట్టారు. ముందుగానే ఆయా విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమైన కంప్యూటర్ సీపీయూ, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అకౌంట్ సెక్షన్లో పెట్టి అందులోని ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాలక మండలి, ఉన్నత విద్యామండలి ఆదేశాలతోనే సోమవారం రాత్రి జిల్లాకు చేరుకున్న విజిలెన్స్ అధికారుల బృందం మంగళవారం మధ్యాహ్నం పరిపాలనా భవనానికి చేరుకున్నారు. అప్పటికే వైస్‌చాన్స్‌లర్ రవీందర్ గుప్తా పరిపాలన భవనం నుంచి ముఖ్యమైన ఫైళ్లను కారులో తీసుకొని బయటికి వెళ్లిపోయారు. అధికారుల బృందం ముందుగా వీసీ చాంబర్‌కు వెళ్లి చూడగా అప్పటికే వీసీ అక్కడ లేకపోవడంతో వీసీ పీఏ సవిత సైతం చాంబర్‌కు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పరిపాలన భవనంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకు అధికారులతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు యూనివర్సిటీకి సంబంధించిన అన్ని అకౌంట్లకు లావాదేవీల వివరాలను సేకరించారు. వాటన్నింటినీ బ్యాంకు నుంచి ప్రింట్అవుట్ ద్వారా తీసుకున్నారు. అకౌంట్ సెక్షన్లోనే ఐదు కంప్యూటర్లలోని హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకొని వాటికి సీల్ వేశారు.
భిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద వీసీని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు..
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ రవీందర్ గుప్తా మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశ్వవిద్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరిపాలన భవనంలో ఉన్న ఆయన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకొని అరగంట ముందుగానే పరిపాలన భవనం నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డిచ్పల్లి ఎస్సై గణేశ్‌కు సమాచారం ఇవ్వడంతో వీసీ వాహనాన్ని వెంబడించి భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ఆధ్వర్యంలో వైస్‌చాన్స్‌లర్ వాహనంలోనే సుమారు గంట పాటు ప్రశ్నించి ఆయన వద్ద ఉన్న ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఉలిక్కిపడిన యూనివర్సిటీ
ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు చేరుకున్నారన్న విషయం తెలియగానే విశ్వవిద్యాలయం ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు ఏసీబీ, విజిలెన్స్ అధికారులు విశ్వవిద్యాలయంపై దాడులు చేసిన సందర్భాలు లేవు. వీసీ రవీందర్ గుప్తా వచ్చాకే విశ్వవిద్యాలయం పరువు ప్రతిష్టను మంటగలిపాడని వర్సిటీలోని అధ్యాపకులు, అధ్యాపకేతరులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. విజిలెన్స్ దాడులతో ఇక పరిపాలన గాడిలో పడినట్లేనని అందరూ భావిస్తున్నారు. అవినీతికి పాల్పడిన వైస్‌చాన్స్‌లర్‌ను జైలుకు పంపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వ ఆదేశాలతోనే విచారణకు వచ్చాం…
తెలంగాణ విశ్వవిద్యాలయంలో కొంత కాలంగా అక్రమ నియామకాలతో పాటు పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగంపై విశ్వవిద్యాలయం పాలక మండలి ఆదేశాల మేరకు పూర్తి వివరాలను సేకరించేందుకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ జరిగిన బ్యాంకు లావాదేవీలతో పాటు అవసరం లేకపోయినా వర్సిటీకి సంబంధించిన కంప్యూటర్లు, ఇతర వస్తువులను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున అవినీతి పాల్పడినట్లు పాలక మండలి గుర్తించి ఉన్నత విద్యాశాఖకు లేఖ రాయడంతో పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాం. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. ఈ రోజు పూర్తికాకపోతే రేపు మరోమారు తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం.
-శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రపురం యూనిట్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

