మోర్తాడ్, మార్చి 15: రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతూ సభను తప్పుదోవ పట్టించిందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.546 కోట్లు ఎక్కువ చేసింది, దీనికి నేను కట్టుబడి ఉన్నానన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కేసీఆర్ మొదటి విడుతలో రూ.236కోట్లు, రెండో విడుతలో రూ.86కోట్లు రుణమాఫీ చేసిందన్నారు.
బట్టివిక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ.. కేసీఆర్ బాల్కొండలో రుణమాఫీ రూ.82.12కోట్లు మాత్రమే చేస్తే, తాము రూ.169కోట్లు చేశామని చెప్పారని, కానీ కేసీఆర్ రెండు విడుతల్లో రూ.318కోట్లు చేస్తే కాంగ్రెస్ చేసింది రూ.169కోట్లు మాత్రమేనని, కాంగ్రెస్ కంటే రూ.148కోట్లు బీఆర్ఎస్ రుణమాఫీ ఎక్కువ చేసిందన్నారు. దీనికి తాను కట్టుబడి ఉన్నానని, తప్పని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రశాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే మీరు ఏ శిక్ష విధించుకుంటారో కానీ…ప్రజలను మాత్రం తప్పుదోవ పట్టించవద్దని అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో 2,03,520 మంది రైతులు ఉంటే అందులో 49శాతం రైతులకు రుణమాఫీ చేశారని, ఇంకా 1,02,965మంది రైతులకు రుణమాపీ కాలేదని చెప్ప్పారు. బాల్కొండ నియోజకవర్గంలో 51,128 రైతులకు రుణమాఫీ చేసింది కేవలం 19,675 మంది రైతులకు మాత్రమే అంటే 38శాతం మంది రైతులకు మాత్రమే అన్నారు. ఇంకా 31,458 మందికి అంటే 62శాతం రుణమాఫీ కాలేదన్నారు. తప్పుడు లెక్కలు చెప్పి సభను తప్పుదోవ పట్టించొద్దన్నారు. తాను లెక్కలతో సహా నిజాలు చెప్పానని, సీఎం రేవంత్‌రెడ్డి సమాధానంలో మాత్రం క్లారిఫికేషన్ లేదన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని ఎమ్మెల్యే వేముల అన్నారు.