మోర్తాడ్/వేల్పూర్, జూలై 15: భీమ్‌గల్‌లో వంద పడకల దవాఖాన, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, భీమ్‌గల్ బస్‌డిపో, సీసీ-బీటీ రోడ్లనిర్మాణం వంటి కీలక అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆగస్టు 15లోపు నాలుగు ప్రధాన ప్రజా సమస్యలను పరిష్కరించాలి, లేకుంటే ఆగస్టు 16 నుంచి మళ్లీ ఉద్యమం ఉధృతం చేస్తామని అల్టీమేటం ఇచ్చారు.
భీమ్‌గల్ అభివృద్ధే లక్ష్యంగా అక్కడి ప్రజల న్యాయమైన హక్కుల సాధన కోసం భీమ్‌గల్‌లో బుధవారం ఒకరోజు కఠోర దీక్షను చేపట్టేందుకు ప్రశాంత్‌రెడ్డి సిద్ధమయ్యారు. అయితే, దీక్షను భగ్నం చేసేందుకు సర్కారు పోలీసులను దింపి వేములను వేల్పూర్లోనే గృహనిర్బంధం చేసింది. దీంతో ప్రశాంత్‌రెడ్డి తన నివాసంలోనే దీక్షకు దిగారు. చేయూత ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ వైద్యుడు మధుశేఖర్ నిమ్మరసం ఇచ్చి ఏడు గంటల పాటు సాగిన వేముల దీక్షను విరమింపజేశారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

బీఆర్ఎస్ పాలనలో భీమ్‌గల్ అభివృద్ధి
2014కు మందు అభివృద్ధికి నోచుకోని భీమ్‌గల్‌కు బీఆర్ఎస్ హయాంలో కొత్తరూపు తీసుకువచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. దాదాపు రూ.100 కోట్లతో నాలుగు లైన్ల రహదారులు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, సీసీరోడ్లు, పార్కులు, వైకుంఠధామాలు, లింబాద్రిగుట్ట అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భీమ్‌గల్ రూపురేఖలు మార్చామన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రూ.35 కోట్లతో వంద పడకల దవాఖానను మంజూరు చేసిందని చెప్పారు.
తాము 15 నెలల్లోనే రూ.15.50 కోట్ల విలువైన పనులు పూర్తిచేసి కాంట్రాక్టర్‌కు రూ.13.50 కోట్లు చెల్లించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత 30 నెలల్లో రూ.3 కోట్ల పనులే చేసి రూ.2.70 కోట్లు మాత్రమే చెల్లించిందని విమర్శించారు. అవి కూడా తాను అసెంబ్లీలో లేవనెత్తిన తర్వాతే వచ్చాయని, ఇందులో స్థానిక కాంగ్రెస్ నేతల పాత్ర ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 23 మంది స్పెషలిస్ట్ వైద్యులను కేటాయించినా, భవనం పూర్తి కాకపోవడంతో ప్రజలకు సేవలు అందడం లేదన్నారు.
పూర్తి చేస్తే సన్మానం.. లేకపోతే సమరం
రాజకీయాల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమన్న ఎమ్మెల్యే.. ఆగస్టు 15లోగా నాలుగు పనులు పూర్తిచేస్తే కాంగ్రెస్ నేత మహేశ్‌కుమార్‌గౌడ్‌ను తానే స్వయంగా సన్మానిస్తానని వేముల ప్రకటించారు. ఆలోపు పనులు పూర్తి కాకపోతే, ఆగస్టు 16 నుంచి భారీ ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి వ్యతిరేకంగా దీక్ష చేయడం గర్వించదగ్గ విషయమని డాక్టర్ మధుశేఖర్ అన్నారు. ప్రజల కోసం, ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించే వేముల లాంటి నాయకున్ని ఎల్లప్పుడు ప్రజలు కోరుకుంటారని అన్నారు.
మహేశ్‌గౌడ్ హామీలు ఏమయ్యాయ్?
మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత మహేశ్‌కుమార్‌గౌడ్ మూడు నెలల్లో రూ.5 కోట్లు విడుదల చేసి దవాఖానను ప్రారంభిస్తామని ప్రకటించారని గుర్తు చేసిన వేముల.. ఐదు నెలలు గడిచినా ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. రూ.3 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును మంజూరుచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.80 లక్షలు విడుదల చేసి పనులు ప్రారంభించిందన్నారు. కాంగ్రెస్ సర్కారు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో మూతబడిన భీమ్‌గల్ బస్‌డిపోను అప్పటి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి సహకారంతో రూ.2.10 కోట్లతో ఆధునీకరించామని వేముల గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బస్సులు, కంట్రోలర్లను నియమించి డిపోను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 2023లో రూ.11.50 కోట్లతో మంజూరైన సీసీ, డాంబర్రోడ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని కోరారు.
దీక్షను అడ్డుకోవడం అప్రజాస్వామికం
మోర్తాడ్, జూలై 15: ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టిన ప్రశాంత్‌రెడ్డిని నిర్బంధించడం ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ, ప్రతిపక్షాన్ని నిర్బంధించడం, పోలీసు రాజ్యాన్ని నడపడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార అహంకారంతో వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.