మోర్తాడ్, ఏప్రిల్ 15: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోర వైఫల్యం చెంది, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలన తీరుపై విసుగు చెందిన ప్రజల్లో మళ్లీ కేసీఆర్ రావాలన్న ఆకాంక్ష బలంగా ఏర్పడిందని, దీంతో ఇప్పుడు అందరూ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మెండోరా మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, నాయకులు (కాంగ్రెస్ పార్టీ) మంగళవారం వేముల సమక్షంలో బీఆర్ఎఎస్లో చేరారు. వారికి వేముల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై భ్రమలు తొలగిపోయాయాయని, అందుకే బీఆర్ఎస్ వైపు చూస్తూ, పార్టీలో చేరుతున్నారని అన్నారు. తెలంగాణకు సీఎం మళ్లీ కేసీఆర్ కావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఏర్పడిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేండ్ల పరిపాలనలో అనేక రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. పురుడుపోసుకున్న తెలంగాణను దేశంలో అగ్రగామిగా కేసీఆర్ నిలిపితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిస్థితి తిరోగమనంగా సాగుతుందన్నారు.
తెలంగాణను తిరిగి అభివృద్ధి పథంలో నడిచేందుకు అందరం కలిసి కట్టుగా పనిచేసి మోసపూరిత కాంగ్రెస్‌ను గద్దెదించుదామని పిలుపునిచ్చారు. కమ్మర్‌పల్లిలో వాల్‌రైటింగ్‌ను ప్రారంభించిన వేముల వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో వాల్‌రైటింగ్‌ను ప్రారంభించారు.