వేల్పూర్, ఆగస్టు 16 : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్‌పై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. కమ్మర్పల్లి మండలం కోనాపూర్, కేసీ తండాకు చెందిన సీనియర్ నాయకులు లకావత్ కన్నయ్య, చిలివేరి సత్యనారాయణ, తండా పెద్దమనిషి దేవులునాయక్, గుగులోత్ శ్రీనివాస్ నాయకత్వంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు ఆదివారం వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి వేముల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. ఎన్నికల వేళ మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని, పింఛన్లను రూ.2000 నుంచి రూ.4 వేలకు పెంచుతామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్, కల్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు. వ్యవసాయంపై ఆధారపడిన గిరిజనులు, సాధారణ రైతులకు రేవంత్ సర్కార్ తీరని అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. రూ.2లక్షల రుణమాఫీ సగం మంది రైతులకు కూడా అందలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిరంతరాయంగా అందిన రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని చెప్పి ఉన్న రూ. 10వేలను కూడా సక్రమంగా ఇవ్వకుండా ఎగ్గొట్టి రైతులను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గతంలో ఫోన్ చేయగానే పొలాల వద్దకే ఎరువులు చేరే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో యాప్‌ల పేరుతో రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. యూరియా, ఎరువుల కోసం అన్నదాతలు రోడ్లపై నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన నిర్వహణ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్వింటాలుకు 10 కిలోల వరకు తరుగు తీస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో లగచర్లలో లంబాడాల భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పోరాడి వారి హక్కులను కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ప్రతిరోజూ గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశా రు. నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నింటినీ రాబోయే రోజు ల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తండా ప్రజల కష్టసుఖాల్లో తాను ఎల్లప్పుడూ ఒక అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని, గిరిజన సోదరీమణులు కోరిన విధంగా త్వరలో జరిగే తీజ్ పండుగ వేడుకలకు తప్పకుండా హాజరవుతానని ఎమ్మెల్యే వేముల భరోసానిచ్చారు. వేల్పూర్ మండల కేంద్రంలోని వేముల నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం లో నాయకులు రాజాగౌడ్, ఉతకం నర్స య్య, రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ రాజారెడ్డి, చిన్నారెడ్డి, పురుషోత్తం, రాజు, గంగారెడ్డి పాల్గొన్నారు.