మోర్తాడ్/బాల్కొండ/ముప్కాల్/మెండోరా, జూలై 9: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల కాలంలో బాల్కొండ నియోజకవర్గంలో 65కు పైగా నూతన గ్రామపంచాయతీ భవనాలు నిర్మించుకున్నామని, 24కు పైగా పల్లెదవాఖానలను ఏర్పాటు చేసుకున్నామని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు, పల్లె దవాఖానలను ఆయన బుధవారం ప్రారంభించారు.
ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించుకున్న కొత్త జీపీ భవనాలన్నీ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాయన్నారు. మండలంలో ఒకే ప్రభుత్వ దవాఖాన ఉంటుందని, గ్రామాల్లోని ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మండల కేంద్రానికి వెళ్లడం కష్టమనే ఉద్దేశంతో కేసీఆర్ ఆలోచించి ఏఎన్ఎం సెంటర్ ఉన్న గ్రామాల్లో పల్లె దవాఖానలను నిర్మించాలని నిర్ణయించారన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన మూడు పల్లె దవాఖానల్లో ఫర్నిచర్, మెటీరియల్, వైద్య సిబ్బంది త్వరగా ఏర్పాటుచేసి.. ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని వైద్యాధికారులకు ఆదేశించారు. పనుల ప్రారంభానికి ఆహ్వానించి, స్వాగతం పలికిన ఆయా గ్రామాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కిసాన్‌నగర్, సోన్‌పేట్ గ్రామా ల్లో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.