మోర్తాడ్/వేల్పూర్, ఏప్రిల్ 7: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న రజతోత్సవ సభకు బాల్కొండ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వేల్పూర్‌లో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. 60 ఏండ్లుగా ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో నలిగిన తెలంగాణ విముక్తి కోసం ఆనాడు కేసీఆర్ ఒక్కడిగా బయల్దేరారన్నారు.
2001లో పార్టీని స్థాపించి 14 ఏండ్లుగా శాంతియుతంగా అనేక పంథాల్లో ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గొప్ప నాయకుడు కేసీఆర్.. సబ్బండ వర్ణాలను ఒక్కతాటిపైకి తెచ్చి పార్లమెంటరీ పంథాలో రాష్ర్టాన్ని సాధించారని చెప్పారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో పదేండ్లు మానవీయ కోణంలో పరిపాలన అందించారని గుర్తు చేశారు. ఇటు పేదల సంక్షేమం, అటు అభివృద్ధిని సమాంతరంగా పరిగెత్తించి తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
అధికారం పోయినప్పటికీ ఉద్యమం చేసి పార్టీ కార్యకర్తలు చురుకైన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్నారని తెలిపారు. అయినోడు, కానోడు, తెలిసినోడు తెలనోడు బీఆర్ఎస్పై నోటికొచ్చినట్లు వాగుతున్నారని, అలాంటి వారందరికీ సమాధానం చెప్పడానికి వరంగల్ సభ వేదిక కానున్నదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో వరంగల్ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. వరంగల్ సభను విజయవంతం చేయడానికి రానున్న మూడు రోజుల్లో గ్రామగ్రామాన సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకుడు కొత్తూర్ లక్ష్మారెడ్డి, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు పాలొన్నారు.