వేల్పూర్/మోర్తాడ్, ఏప్రిల్ 5 : కులరహిత సమాజం కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో వేముల పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల కోసం రాజ్యాంగం రచిస్తే, ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా కృషి చేసిన ఆదర్శ నేత బాబు జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు. తన జీవిత కాలం మొత్తం అణగారిన వర్గాల కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం అన్ని వర్గాలు ఏకమై పాటుపడాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతోపాటు చిన్నప్పటి నుంచే వారిలో ఉన్నత లక్ష్యాలు ఏర్పడేలా మార్గదర్శకాలు చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని విద్యాసాయి స్కూ ల్ రజతోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను శనివారం కలిసి వారికి అభినందనలు తెలిపారు.
అనంతరం వేములకు రజతోత్సవ వేడుకల జ్ఞాపికను పాఠశాల తరపున అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి , పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట గంగాధర్, ప్రకాశ్, రాధాకిషన్, గడ్డంస్వామి, సుమన్, మైలారం సుధాకర్, రాజన్న, రెంజర్ల మహేందర్, హరీశ్, మురళి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.