మోర్తాడ్/భీమ్‌గల్, మే 8: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చిన్నపాటి తాలుకే ‘తాలు తీస్తే తోలు తీస్తానని’ బీరాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో రైతును నిలువు దోపిడీ చేస్తుంటే ఎవరి తోలు తీయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. తాలు పేరుతో రైతులను దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను వేధిస్తే సహించేదిలేదని స్పష్టంచేశారు. వడ్ల కొనుగోళ్లపై ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని, రైతులకు మాత్రం కన్నీటిని మిగులుస్తున్నదని మండిపడ్డారు.
శుక్రవారం ఆయన కమ్మర్పల్లి మండలం బషీరాబాద్, భీమ్‌గల్ మండలంలోని బడాభీమ్‌గల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరుగు పేరుతో జరుగుతున్న కోతలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాలుకు 4 నుంచి 8 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులు కష్టపడి పండించిన పంటను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. నెల రోజులుగా ధాన్యం కాంటా చేయక కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు పడుతున్నామన్న రైతుల ఆవేదనను, కేంద్రాల్లో అస్తవ్యస్త పరిస్థితులను చూసి చలించిన ఆయన అక్కడి నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఎస్వో శ్రీకాంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు.
వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయిలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీఎం,డీసీవో, డీఎస్వో అధికారులు, రైస్‌మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియను వేగవంతం చేయాలని, లారీల కొరత వెంటనే తీర్చాలని, హమాలీలను అందుబాటులో ఉంచాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నెల రోజులుగా వడ్ల కుప్పల వద్దే నిరీక్షిస్తున్న రైతులతో నేరుగా మాట్లాడి, వారు పడుతున్న ఇక్కట్లను వివరించి, వారితో మాట్లాడించారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మండిపడ్డారు. ఒక్క బషీరాబాద్ కొనుగోలు కేంద్రం వద్ద 125 లారీలకు సరిపడా ధాన్యం నెలరోజులుగా ఉన్నాయంటే, కొనుగోళ్లు ఎంత నత్తనడకన నడుస్తున్నాయో అర్థమవుతున్నదని, దీనికి తోడు వర్షాలు కురవడంపై రైతులు మరింత ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హమాలీలు, టార్పాలిన్లు, లారీలు వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేర నిర్లక్ష్యం వహిస్తుందో స్పష్టమవుతుందన్నారు. మిల్లర్ల తరుగు దోపిడీపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వం చెబుతున్నది ఒకవిధంగా ఉంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో విధంగా ఉన్నదని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని చెబుతున్నారని, కానీ వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. స్వయంగా కల్లాలకు వచ్చి చూస్తే రైతుల బాధ అక్షరసత్యమని అర్థమయ్యిందన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నదని, సీఎం వెంటనే ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించాలని వేముల డిమాండ్ చేశారు.
బడాభీమ్‌గల్‌లో రైతులు తమ గోడును ఎమ్మెల్యేకు వివరిస్తూ ఏప్రిల్ 2,3,5వ తేదీల్లో వడ్లు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా ఇప్పటి వరకు తూకం వేయలేదని వాపోయారు. బడాభీమ్గల్లోని ఒక్క సెంటర్లోనే సుమారు 50 లారీలకు పైగా ధాన్యం కుప్పలు పెండింగ్‌లో ఉన్నాయని రైతులు తెలిపారు. రైతు రావుల అంజయ్య భార్య మాట్లాడుతూ…తన భర్త గల్ఫ్‌లో ఉన్నాడని, నెల రోజులుగా తాము ఇక్కడే కాపలా కాస్తున్నామని, ఎవరూ పట్టించుకోవడంలేదని కన్నీటి పర్యంతమయ్యారు. వేగవంతమైన ధాన్యం సేకరణ అంటే ఇదేనా అని ఉత్తమ్‌కుమార్ రెడ్డిని వేముల ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. దొడ్డు వడ్ల పేరుతో రైతులను వేధించడం దారుణమన్నారు. సన్న వడ్లకు ప్రకటించిన బోనస్ కూడా అందక రైతులకు సరైన లాభం చేకూర్చడంలేదన్నారు. సన్నవడ్లకు దిగుబడి తక్కువగా రావడంవల్లే రైతులు దొడ్డు వడ్లు పండిస్తున్నారన్నారు. రైతుల శ్రమ నేలపాలు కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రతి గింజను కొనుగోలు చేయాలని, రైతులకు చెల్లించాల్సిన సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయాలని, లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు కొనుగోళ్లపై సమీక్ష ఉండేదని, లారీలు, హమాలీలు, టార్పాలిన్ల సరాఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండేదని, కానీ ఇప్పుడు మాత్రం రైతులను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన విషయంలో ఎటువంటి రాజకీయాలు లేవని, రైతులకు న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే వేముల స్పష్టం చేశారు. రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు జిల్లా అధికారులతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటామని అన్నారు.