మోర్తాడ్, జనవరి 25: బుస్సాపూర్‌లో రైతు ముఖాముఖి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలో రైతు మామిళ్ల నర్సయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పుడే తెలిసిందని ఫోన్లో వచ్చిన మెస్సేజ్‌ను మాజీ మంత్రి వేముల చూపించారు. అధ్యయన కమిటీ రైతుల బాధలు తెలుసుకుని వారిలో ధైర్యాన్ని నింపేందుకు తిరుగుతున్న ఈ సమయంలోనే మరో రైతు నేలవాలిండని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దుర్మార్గమైన ప్రభుత్వం చేతకానితనం వల్ల, కక్షపూరిత వైఖరి వల్ల కేసీఆర్ ఏం చేస్తే అది తీసేయ్యాలనే పిచ్చి ప్రతీకార చర్యల వల్ల రైతులకు ఈ దుస్థితి ఏర్పడుతున్నదన్నారు. కేసీఆర్ రైతుబంధు ఇస్తే దాన్ని ఆపేయాలా? కేసీఆర్ పంటలు కొంటే మనం కొన్ని రోజులు లేట్ చేయాలా? అన్న ప్రభుత్వ ఆలోచనలతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరడంతో కార్యక్రమానికి హాజరైన రైతులు, అధ్యయన కమిటీ సభ్యులు లేచి మౌనం పాటించారు.