ఖలీల్‌వాడి, జనవరి 12 : తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి పాలనను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని, కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ ప్రజలచే చీత్కరించబడుతున్నదని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వేముల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని మండిపడ్డారు.
రూ.2500 చేయూత పింఛన్ ఇప్పటికీ పుట్టనే లేదని, రూ. 2వేలు పెన్షన్‌ను రూ. 4 వేలు చేస్తామని చెప్పి చేయలేదని గుర్తు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్, విద్యుత్, రెండు లక్షల ఉద్యోగాలు, తులం బంగారం, విద్యా భరోసా కార్డు వంటి హామీలన్నీ గాల్లో కలిసిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాల కారణంగా ఆ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, సర్పంచ్ ఎన్నికల్లోనే ఆ విషయం స్పష్టమైందని తెలిపారు.
నిజామాబాద్ అర్బన్‌లో గట్టిగా పనిచేస్తే 30కి పైగా కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉన్నదని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ముమ్మాటికీ కేసీఆర్ వైపే ఉన్నారని, గతంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు సరిగ్గా చెప్పగలిగితే విజయం ఖాయమని పేర్కొన్నారు. పార్టీలో అనుభవజ్ఞులైన సీనియర్ కార్యకర్తలు ఇప్పటికీ బలంగా ఉన్నారని తెలిపారు. నిబద్ధతతో పని చేసే ప్రతి డివిజన్‌కు ఇద్దరు ముగ్గురు నాయకులు చాలని, ఎన్నికల్లో గెలవవచ్చని చెప్పారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని, గణేశ్‌గుప్తా అర్బన్ ప్రజల్లో ఉన్నారని పేర్కొన్నారు.
పదేండ్లలో గణేశ్ గుప్తా అర్బన్ అభివృద్ధికి అనేక కీలక పనులు చేశారని, సంఘాలు అని చూడకుండా ప్రతి వర్గానికీ సమానంగా నిధులు కేటాయించారని గుర్తుచేశారు. ఒకప్పటి నిజామాబాద్‌తో పోలిస్తే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని, అది కేసీఆర్ నాయకత్వం గణేశ్‌గుప్తా కృషి వల్లే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గడపగడపకూ వెళ్లి పదేండ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో తిరిగితే ప్రజలు మనల్ని హత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
బీజేపీ పని అయిపోయిందని, ఆ పార్టీ మాటలకే పరిమితమైందని వేముల ఎద్దేవా చేశారు. ఇక చెప్పుకునేందుకు బీజేపీకి ఏమీ మిగలలేదన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లీడ్ ఇచ్చిన బాల్కొండ గ్రామంలో కూడా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని తెలిపారు. బీజేపీ 3వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. భీమ్‌గల్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులే సాక్ష్యంగా నిలిచి, ప్రజలు 12కు 12 కౌన్సిలర్ స్థానాలను బీఆర్ఎస్కు కట్టబెట్టారని గుర్తుచేశారు.
-ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అర్బన్‌లో బిగాల గణేశ్‌గుప్తా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిజామాబాద్ దశ దిశని మార్చారని గుర్తుచేశారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయించారని తెలిపారు. మాడ్రన్ వైకుంఠధామాలు, మినీ ట్యాంక్‌బండ్, బీటీ రోడ్లు, అన్ని కులాలకు కల్యాణ మండపాలు, సెంటర్ మీడియన్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత బిగాలదే అని పేర్కొన్నారు. అనేక కార్యక్రమాలు చేసి మిస్టర్ ఫర్ఫెక్ట్గా పేరు సంపాదించుకున్నారని కొనియాడారు. నగరాన్ని అభివృద్ధి చేసి తెలంగాణలో నంబర్‌వన్ స్థానా న్ని కైవసం చేసుకున్నారని తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతి జిల్లాలోఅభివృద్ధి జరిగిందని చెప్పారు.
రానున్న ఎన్నికల్లో మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగరేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. అభివృద్ధే మన అజెండా అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని పేర్కొన్నారు. అర్బన్‌లో గడిచిన పదేండ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లి ఓట్లు అడిగే అర్హత కేవలం బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలోని ఏ ఒక్క డివిజన్లో కూడా కొత్త అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయలేదన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ప్రతి డివిజన్లో పార్కును, బొడ్డెమ్మ చెరువును అభివృద్ధి చేశామన్నారు. కనీసం పూడికతీతకు నోచుకోని ఎన్నో నాలాలను శుభ్రం చేసి వర్షాకాలంలో వరదను మళ్లించేందుకు డ్రైనేజీలను నిర్మించినట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా అండగా ఉన్నామని పేర్కొన్నారు. అన్ని కులాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరుచేసినట్లు తెలిపారు. కరోనా సమయంలో రాజకీయాలకతీతంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. బీఆర్ఎస్ పాలన, ఈ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు చర్చించేలా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, మాజీ మేయర్ దండు నీతూకిరణ్ శేఖర్, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నాయకులు సత్యప్రకాశ్, సుజిత్‌సింగ్ ఠాకూర్, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్, మతీన్ పాల్గొన్నారు