మోర్తాడ్, జనవరి 21: పోలీసుల పహారా మధ్య గ్రామసభలు ఎందుకు నిర్వహిస్తున్నారు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఇదేనా మీ ప్రజా పాలన రేవంత్‌రెడ్డి గారు అని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైన గ్రామసభల తీరును గురించి తెలుసుకున్న ఆయన ఈ మేరకు స్పందించారు. ముఖ్యమంత్రి, మంత్రులు పాలన గాలికి వదిలేసి విదేశాల్లో తిరుగుతుంటే గ్రామసభలు పోలీసుల కనుసన్నల్లో జరపడం మీచేత కాని పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
హామీలపై నిలదీస్తున్న ప్రజలను ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. గ్రామసభల్లో పాల్గొన్న అధికారులను.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజలునిలదీస్తూ నోటికొచ్చినట్లు తిడుతున్నారని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులకే పెద్దపీట వేస్తున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కడిక్కడ నిలదీస్తున్నారన్నారు. గ్రామసభల్లో ప్రజల వ్యతిరేకత చూశాక ప్రజలు మీ ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో తేటతెల్లమైందన్నారు.