మోర్తాడ్/ ముప్కాల్, సెప్టెంబర్ 26: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్షతోపాటు తులం బంగారం ఎప్పుడిస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హామీ ఇచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ తులం బంగారం హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన 424 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే వేముల మా ట్లాడారు. తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలతో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడిస్తడో ఇంకా తేలుతలేదన్నారు. పండుగ ముందు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందుకుంటున్న ఆడబిడ్డలందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ స్వీయ అనుభవం, ఆలోచనల నుంచి పుట్టిందే కల్యాణలక్ష్మి పథకమని తెలిపారు. 12 ఏండ్ల క్రితం ఈ పథకం మొదట రూ.50వేలతో ప్రారంభమై తర్వాత లక్షా నూట పదహార్లకు పెంచినట్లు తెలిపారు.
బాల్కొండ నియోజకవర్గంలో పదేండ్ల కాలంలో సుమారు 12వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగించడం సంతోషమని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం లక్షరూపాయల చెక్కుతోపాటు తులం బంగారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన లబ్ధిదారులందరికీ తులంబంగారం ఇవ్వాలని కోరారు.
ప్రతి మహిళకూ రూ.2500, బీడీ, ఆసరా పెన్షన్లు రూ.4వేలకు పెంపు హామీలు అమలు చేయలేదన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఇంతవరకూ నెరవేర్చలేదని మండిపడ్డారు. విద్యార్థులకు స్కూటీల మాటే మరిచిపోయారని, ఏ ఒక్క హామీని సరిగా నెరవేర్చని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. హామీలు అమలు చేయని పక్షంలో మహిళలందరినీ కూడదీసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా ఇతర అనేక మార్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూనే ఉంటామని పేర్కొన్నారు.
తులం బంగారం హామీని నమ్మి మహిళలు కాంగ్రెస్‌కు ఓటు వేసి ఆ పార్టీకి అధికార హోదా, తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని వేముల అన్నారు. కాం గ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తులం బంగారం ఇవ్వాలని అడిగితే కాం గ్రెస్ నాయకులు గొడవలు చేస్తున్నారని, ఈ విషయమై భీమ్‌గల్‌లో మంత్రిని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జి చేసి, కేసులు పెట్టారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం అధికారంలో ఉన్న వాళ్ల పని అని తెలిపారు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై గొడవలకు దిగడం, అధికారాన్ని అడ్డు పెట్టుకుని లాఠీచార్జి చేయించడం ప్రజాస్వామ్యం కాదన్నారు.