యాచారం, ఫిబ్రవరి 20: వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకున్నది. మండలంలోని మల్కీజ్గూడకు చెందిన నానకంపేట కల్యాణి గురువారం యాచారంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు డెలివరీ చేసేందుకు ప్రయత్నించారు. బాబు 4.5 కిలోలు ఉండటంతో డెలివరీలో ఇబ్బందులు తలెత్తాయి. సర్జరీ చేయాల్సిన ఉండగా సిబ్బంది నార్మల్ డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యారు.
నిర్లక్ష్యంగా డెలివరీ చేయడంతో ప్రసవంలోనే నవజాత శిశివు మృతి చెందిందని, కల్యాణి కోమాలోనే ఉన్నదని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వైద్యాధికారి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. బాబు బరువు స్కానింగ్ లో తక్కువగా ఉన్నదని, డెలివరీ సమయంలో ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. తల్లీ క్షేమంగా ఉండాలని శిశువును బయటకు తీసినట్టు ఆమె చెప్పుకొచ్చారు.