మోర్తాడ్, ఏప్రిల్ 30: తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ ప్రజలందరి గుండెల్లో ఉన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ చరిత్రను సమాధి చేసేంత శక్తి, స్థాయి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని…తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్ చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుందని పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాలు విడుదల, బసవేశ్వరుడి జయంతి సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేముల ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
రూ.2వేల పింఛన్ అసరా పెన్షన్ అవ్వతాతలు, బీడీ కార్మికుల చిరునవ్వుల్లో, రూ.4వేల పెన్షన్ అందుకున్న దివ్యాంగుల్లో, రైతుబంధు, రైతుబీమా పొందిన లక్షలాది మంది రైతుల కుటుంబాల్లో, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందుకున్న రాష్ట్రంలోని లక్షలాది ఆడబిడ్డల కుటుంబాల్లో , కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పారుతున్న నీళ్లలో, ఎండాకాలం మత్తళ్లు దుంకిన చెరువులు, కాలువలు, చెక్‌డ్యాంల జలసవ్వడిలో, కులవృత్తిని నమ్ముకుని కేసీఆర్ ద్వారా లబ్ధిపొందిన యాదవులు, గొల్లకుర్మలు, మత్స్యకారులు, రజక, నాయీబ్రాహ్మణ, గౌడ సోదరుల జీవితాల్లో, గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియం చదువుకున్న లక్షలాది విద్యార్థుల గుండెల్లో, అభివృద్ధి చెందిన ఐటీ,
పారిశ్రామిక రంగాల్లో ఉపాధి పొందుతున్న యువకుల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా ఉంటాడని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన వ్యక్తిగా కేసీఆర్ పేరు తెలంగాణ చరిత్రలో కలకాలం లిఖించబడి ఉంటుందని తెలిపారు. 14 ఏండ్ల సుదీర్ఘపోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తిగా, వచ్చిన తెలంగాణ రాష్ర్టాన్ని అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉంచిన చరిత్ర కేసీఆర్‌ది అని పేర్కొన్నారు.
రేవంత్ ప్రభుత్వం ఇస్తానన్న రూ.4వేల పింఛన్, ప్రతిమహిళకు రూ.2500, తులంబంగారం, రుణమాఫీ, రైతుభరోసా, ధాన్యానికి బోనస్, 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగభృతి, విద్యాభరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీ, కౌలు రైతుకు రైతుభరోసా, ఉపాధికూలీలకు, ఆటోకార్మికులకు రూ.12వేలు ఇవ్వడంలేదని, ఇది మాట తప్పడం కాదా అని ప్రశ్నించారు. మంత్రులు, పార్టీ నాయకులే రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదని, ఆయనను ప్రజలు కూడా గుర్తుపట్టడం లేదని, ఆయన గురించి కేసీఆర్ మాట్లాడాలా.అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యారని, ముఖ్యమంత్రి హోదా మరిచి అసందర్భంగా చౌకబారు మాటలు మాట్లాడితే ప్రజలు త్వరలోనే ఆయనకు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని వేముల హెచ్చరించారు.
ఓటుకు నోటు కేసులో ఒక ముద్దాయిగా ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుందని వేముల ఎద్దేవా చేశారు. లక్షలాది మంది తరలివచ్చి జనసంద్రం లాంటి వరంగల్ సభలో కేసీఆర్ తన పేరు కూడా తీయలేదన్న ఫ్రస్టేషన్లో రేవంత్‌రెడ్డి ఉన్నాడని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో మైండ్ బ్లాంక్ అయ్యి రేవంత్‌రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.