మోర్తాడ్, మే 9: రైతులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఇప్పుడు రైతులు గోస పడుతుంటే పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్‌మిల్లర్లు రైతులను దోచుకుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉన్నది రైతుల కోసమా..? రైస్ మిల్లర్ల కోసమా? అని నిలదీశారు. బాల్కొండ మండలం కిసాన్‌నగర్ మార్కెట్‌యార్డుతో పాటు మోర్తాడ్‌లోని ఐకేపీ, సొసైటీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాలను వేముల శనివారం పరిశీలించారు. రైతులకు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లయ్ అధికారులకు ఫోన్ చేసి కొనుగోళ్లలో జాప్యంపై రైతుల పక్షాన నిలదీశారు. ఒక ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో ఉండి అరగంట నుంచి ఫోన్ చేస్తుంటే కలెక్టర్ అందుబాటులోకి రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రైతులు ఇక్కడ ఎండలో కష్టపడుతుంటే అధికారుల నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు.
రైస్‌మిల్లర్లు తరుగు పేరుతో రైతులను తీవ్రంగా దోచుకుంటున్నారని, క్వింటాలుకు పది కిలోల తరుగు తీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నదని వేముల ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా దోపిడీ సాగుతున్నదన్నారు.గన్నీ బ్యాగులు ఉన్నా యా? లారీల వస్తున్నాయా? సమయానికి ధాన్యాన్ని తూకం వేస్తున్నారా.. బస్తాలు తరలిస్తున్నారా? అనే పర్యవేక్షణ లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రైతుల సమస్యలు వివరించేందుకు కలెక్టర్‌కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని, ఒక ఎమ్మెల్యేగా తనకు ఫోన్లో అందుబాటులో లేకపోతే సామాన్య రైతు పరిస్థితి ఏమిటని ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అడిషనల్ కలెక్టర్‌కు ఫోన్ చేసి, రైతుల సమస్యలు వివరించిన వేముల.. వెంటనే అదనపు లారీలు, గన్నీ బ్యాగులు, ఏర్పాటు చేసి వెంటనే ధాన్యం సేకరణ పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఉపాధిహామీ కూలీలను అదనంగా వినియోంచాలని సూచించారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని, అవసరమైతే తానే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నేతలు కల్లెడ ఏలియా, రాజాపూర్ణానందం, ప్రవీణ్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బద్దం రవి, సర్పంచ్ బోగ ఆనంద్, సొసైటీ చైర్మన్ బద్దం అశోక్, పర్సదేవన్న, జేసీ గంగారెడ్డి, ఇంతియాజ్, యూసుఫ్, ఏనుగు రాజేశ్వర్, శ్రీనివాస్, సత్యనారాయణ, గందం మహిపాల్, ఎనుగందుల అశోక్, శాస్త్రి పాల్గొన్నారు.
పాలసీ ప్రభుత్వం తయారు చేస్తుందా..? లేక మిల్లర్లు తయారు చేస్తున్నారా? ప్రభుత్వ యంత్రాంగం ఇంత చేతకానిదిగా ఎందకు తయారైందని ఎమ్మెల్యే వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్లు, ఇన్చార్జి అధికారులు మిల్లర్లకు, రైతులకు మధ్య నలిగిపోతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో సంచికి 41.5 కిలోలు మాత్రమే మిల్లర్లు తీసుకునేదని, కానీ ఇప్పుడు నిజామాబాద్, బోధన్ ప్రాంతంలోని కొన్ని రైస్‌మిల్లుల యజమానులు 44.5-45 కిలోలు అడుగుతుండడం బాధకరమన్నారు. ముకుంద రైస్‌మిల్లర్ సంచికి 44.5 కిలోలు అడుగుతున్న మాట వాస్తవమేనని, దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్ సాక్ష్యం తన దగ్గర ఉందన్నారు.
వెంటనే ముకుంద రైస్‌మిల్లును సీజ్ చేయాలని వేముల డిమాండ్ చేశారు. తరుగు లేకుండా ధాన్యంతో అన్లోడింగ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, లారీల సంఖ్యను పెంచి రవాణాను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బోధన్, బాన్సువాడ ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్ట్ వెహికిల్ డైవర్ట్ చేయాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే, తానే స్వయంగా ఆందోళన నిర్వహిస్తానని, రైతుల కోసం రోడ్డుమీదకు వస్తానని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు.