UCC bill : యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో యూసీసీ బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. ఈ బిల్లును జూలై 20, సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రేమ, పెళ్లి, సహజీవానికి సంబంధించిన కీలక అంశాల్ని ఈ బిల్లులో పొందుపరిచారు. ఈ చట్టానికి సంబంధించి తమకు ప్రజల నుంచి 9.58 లక్షల సలహాలు వచ్చాయన్నారు.
ఈ బిల్లుకు 93.54 శాతం మంది మద్దతు ఇచ్చారని చెప్పారు. అలాగే ముస్లిం మహిళల్లో 80 శాతం మంది, ముస్లిం పురుషుల్లో 40 శాతం మంది ఇందులో పాల్గొని మద్దతు ఇచ్చారన్నారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో పలు రాజకీయ పార్టీలు పాల్గొన్నాయని, కానీ, కాంగ్రెస్ మాత్రం పాల్గొనలేదని చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలను కూడా భాగస్వాముల్ని చేశామని వెల్లడించారు. ప్రతిపాదిత యూసీసీ బిల్లులోని కీలక అంశాలివి. ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం రద్దు.నిఖా హలాలాకు పాల్పడినా నేరంగానే పరిగణిస్తారు. విడాకులు, వారసత్వం విషయంలో చట్టబద్ధత కల్పించడం. మహిళలకు, పురుషులకు సమానంగా వారసత్వ హక్కులు కల్పించడం. నెల రోజులకుపైగా సహజీవనం చేస్తే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
Zసహజీవనం విషయంలో పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లు తప్పనిసరి. మొదటి వివాహాన్ని మాత్రమే చట్టబద్ధంగా గుర్తించడం, రెండో వివాహానికి చట్టబద్ధత ఉండదు. వివాహం అయిన వ్యక్తి మరొకరితో సహజీవనం చేస్తే గరిష్టంగా ఐదేళ్లవరకు జైలు శిక్ష. పెళ్లికి, విడాకులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. గ్రామస్థాయిలోనే వివాహాల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గిరిజన తెగలకు ఈ బిల్లునుంచి మినహాయింపు ఉంటుంది. ఆర్టికల్ 342, 366 (క్లాజ్ 25) ప్రకారం ఈ మినహాయింపు ఇచ్చారు.