సూర్యాపేట, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్యభవన్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని (హెల్ప్‌డెస్క్)ఆయన ప్రారంభించి భార్య సునీతతో కలిసి తొలి రోజే తమ ఓటు నమోదు చేసుకున్నారు.
అనంతరం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్థాయి ముఖ్యనాయకుల సన్నాహక సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలను చూస్తున్న పట్టభద్రులు శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు. గతంలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటరు లిస్టు పూర్తిగా రద్దయిందని చెప్పారు.